పుట:Himabindu by Adivi Bapiraju.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 “అన్నా! నీవు క్షేమముగా వెళ్ళిరా. మాఅన్న వీరుడని చెప్పుకొన ఎంతో ముచ్చట నాకు. హిమబిందును రక్షించుకొనుము. ఆ పని ఇంక ఎవ్వరును చేయలేరు. నేను నీకు తమ్ముడనైనచో, ఈ విపత్తులో నీ వెను వెంట వచ్చియుందును. ఆంధ్రశత్రువుల నాశనము చేసి నీ ప్రియురాలిని నీవే తీసికొనిరా” యనినది.

శక్తిమతి తలవంచియున్న పుత్రుని శిరస్సుపై చేయినిడి “మహాశ్రమణకుడు నిన్ను రక్షించుగాక! నాయనా! జయశ్రీ శోభితుడవై యశో విరాజితుడవై తిరిగిరా. అనవసరముగ ప్రాణములు బలిగొనకుము. శరణార్థుల విడిచిపుచ్చుము. నీ శిల్ప బ్రాహ్మణ వంశమర్యాద మరువకు. ఈ రక్షరేకును నీ హృదయమున ధరించుకో, పోయిరా!” అని గద్గదికమున బలికినది.

అశ్వము సిద్ధముగానున్నదని ఇంతలో వార్త వచ్చినది. సువర్ణశ్రీ నాగబంధునిక వీపుపై తట్టి, సిద్ధార్థినికను ముద్దుపెట్టుకొని తల్లికి నమస్కృతులిడి, మహాలి మొదలగువారికడ సెలవునంది, సర్వాభరణభూషితము, సార్వభౌమ బహుకృతమునగు ఉత్తమాజానేయము కడకుబోయి సూతుడందిచ్చు ఖలీనము నందుకొని, చివ్వున నా ఆశ్వముపై నధిరోహించి సేవకుడందిచ్చు బాణములపొదియు, విల్లు నంది పుచ్చుకొని, పొది స్కంధమునకు బిగించుకొని కేడెము వీపున బిగించుకొని, ధనుస్సు ఎడమభుజమునకు తగిలించుకొని, శూలము, శూలశిరస్సులు, పరశువు, ఆహారపుసంచి, ధనపుసంచి, వస్త్రపుసంచియు జీవనమునకు గట్టిగా సేవకుడు కట్టినది పరిశీలించి “వెళ్ళివచ్చుచున్నా” నని కేకవైచి గుఱ్ఱమును నడిపించెను.

ఎవరీ సుందరుడని ప్రజలు అక్కజంపడ రేవుకడ కృష్ణలో సువర్ణశ్రీ గుఱ్ఱమును దింపెను. లంకలపై నడచుచు, అక్కడక్కడ సెల యేళ్ళవలె ప్రవహించు కృష్ణపాయలను ఆ గుఱ్ఱముపై పదిక్షణములలో దాటెను.

అతడు ఫ్లుతగతితో ప్రొద్దు నెత్తిమీదకు వచ్చునప్పటికి మహారాజ పథమున పదిగోరుతముల దూరము పోయెను. అక్కడ నొక సత్రమున నాగి స్నానాదికము లొనరించి, భోజనముచేసి పదిముహూర్తము లచ్చట విశ్రమించెను. గుఱ్ఱమును సేదతేర్చి, ఆహారమిచ్చి, ఒడలంతయు రుద్ది, అశ్వారూఢుడై ప్రయాణము సాగించెను.

అతడు రాత్రి మొదటియామములో మహాగ్రామము చేరెను. 

3. మహారణ్యము

నాలుగు రోజులలో సువర్ణశ్రీ మహారణ్యప్రవేశ మొనర్చెను. ఆతనికిముందు ఆంధ్రచమూపతులు ఇటు వెళ్ళిరి అటు వెళ్ళిరి అనువార్తతక్క హిమబిందుజాడగాని, చోరులజాడగాని ఇంతయైన తెలియలేదు. మంత్రకల్పమునవారందరు ధాన్యకటక పరిసరములనే మాయమైపోయిరా? లేక ఆంధ్రచారులను మించిన మాయాధురీణులా ఆ చోరులు? ఏమైపొయినారు? ఆ దివ్యమూర్తిని వారు తమకర్కశహస్తములతో అంటిరి కాబోలు ఆమె ఎంతబాధ పడుచున్నదో, ఎంత భయమందినదో? ఆ సుందరోజ్వలమూర్తి వడలిన పూపువలె సొమ్మసిల్లిపోయి వుండును. చిన్ననాటనుండియు కష్టమెట్టిదో ఎరుంగని ముక్తావళీదేవి ఎంత అలమట చెందుచున్నదో? ఎంత పని చేసి రీ దుర్మార్గులు!


అడివి బాపిరాజు రచనలు - 2

• 167 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)