పుట:Himabindu by Adivi Bapiraju.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 “కన్న చెల్లీ! నాకు తిలక ముంచుము. చిన్న చెల్లి ఏదీ? ఎవరక్కడ? అమ్మాయి సిద్ధార్థినికను పిలువుడు. త్వరగా లోనికి వచ్చి తిలకము పెట్టుము!”

“అన్నా! తిలక మెందుకు? యుద్ధమునకు రమ్మని నాన్నగారికడ నుండి ఆజ్ఞవచ్చినదా? లేక సేనానాయకు లెవరైన ఆజ్ఞ ఇచ్చిరా?”

“అన్నియు చెప్పుచుందును. నీవు ముందు నాకు తిలక ముంచవలయును, రమ్ము.”

“అమ్మా!” అని నాగబంధునిక కేక వైచెను. తల్లి పూజాగృహము నుండి నిష్కుటములోనికి వచ్చినది. ఆమెయు కుమారుని జూచి, ఎవరో ఏమోయనుకొని, దిగ్భ్రమనంది, యట్లే నిలుచుండిపోయినది. నాగబంధునికయు, సువర్ణశ్రీయు పకపక నవ్విరి. అప్పుడు పుత్రు నాలవాలుపట్టి “ఇది ఏమిరా నాయనా?” యని యామె వా రిరువురికడకు వచ్చినది.

సువర్ణశ్రీ: అమ్మా! నేను యుద్ధమునకు బోవుటలేదు. హిమబిందును వెదుక బోయెదను. కొందరు సేనాధికారు లపుడే ఆమెను వెదుక బోయిరి. నేనును పోయెదను. హిమబిందునింట శ్రీ ఆనందులవారు కనబడినారు. నన్ను వెంటనే బయలుదేరి పొమ్మని ఆజ్ఞఇచ్చినారు. వెళ్ళు చున్నాను. చెల్లీ, తిలకముదిద్దవే, ఆరతితో అమ్మగారి ఆశీర్వాదము పొందవలెను. జాగు చేయకు.

శక్తి: వెదకుటకు ఈ వేషమంతయు వేసినావు, పోరాటము ఏమైన జరుగునా ఏమి? అంతమంది వెళ్ళుచున్నప్పుడు నీ వెందుకురా బాబూ?

నాగ: అమ్మా! నీకును మతిపోయినదా? అన్నను వెళ్ళనీ! ఇక్కడ ఏమియుతోచక మతిపోయినవానివలె నున్నాడు. వీరులైన ఆంధ్రయువకులింటి దగ్గర కూరుచుండు సమయమా? అన్న తీసికొని వెళ్ళునేని నేనుగూడ సిద్ధము.

శక్తి: నీ వెంతకైన తగుదువు! మగవీరుడవు.

ఇంతలో మహాలియు, సిద్ధార్థినికయు, పలువురు పనికత్తెలు, కొందరు చుట్టములు, సేవకులు అచ్చటకు పరుగిటివచ్చిరి. చిరుగాలివలె వచ్చిన చిన్నచెల్లెలిని సువ్వున నెత్తికొని సువర్ణశ్రీ యామెను ముద్దిడు కొని, క్రిందకు దింపి, “తల్లి నాకు ఆరతి ఈయవలయును, తిలక మిడవలెను, రా, లోనికి” అని ఇంటిలోనికి సాగినాడు.

యుద్ధములోనికి వెళ్ళుచుండెనేమో యని పనివారంద రనుకొనిరి. మహాలికంతయు నర్థమై, లోనికిబోయి, దేవతాగృహమునుండి బంగారు పళ్ళెము, దీపపుకుంది, కర్పూరము, అక్షతలు, పూవులు, అగరునూనెయు, తిలకకరండము సిద్ధముచేయుచుండ నచ్చటి కందరు వచ్చిరి.

బుద్ధభగవానుని పంచలోహవిగ్రహ మందున్నది. ఆ విగ్రహమున కీవలావల పంచానన బ్రహ్మవిగ్రహ మున్నది. క్రొత్త పూజ లెన్ని వచ్చినను శిల్ప బ్రాహ్మణులు అనాదియగువారి పంచముఖవిశ్వ బ్రహ్మపూజ మానరు. ఆ పీఠముప్రక్క వేరొక్క పూజాపీఠముపై మాయాదేవి విగ్రహమును, శారదాదేవి విగ్రహమును, పార్వతీదేవి విగ్రహము నున్నవి. ఆ పూజాపీఠము శక్తి మతీదేవిది.

శక్తిమతీదేవి నిర్ఘాంతపడి మాటలాడక, తన పూజాపీఠమునుండి కాశ్మీరపుష్పమిశ్రిత మగు తిలకము తానే యాతనినొసట నుంచి, కొమరితలతో కూడి ఆరతినిచ్చి, మోకరించు కొమరుని ఆశీర్వదించుచు అక్షతలు జల్లెను. ఆమె కన్నులు గిఱ్ఱున నీరుతిరిగినది. సిద్ధార్థినిక కేమియు నర్థము కానందున వెక్కివెక్కి ఏడ్చినది. నాగబంధునిక చిరునవ్వుమోమున ప్రసరింప, కన్నులు విస్ఫారితముగా, ప్రభాకలితవదనయై అన్నను జూచి,

అడివి బాపిరాజు రచనలు - 2

• 166 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)