తృతీయ భాగం
1. బెదరింపు
ఒకనాడు సమవర్తి చెంత శత్రువులకడనుండి ఒక రాయబారి వచ్చినాడు. వినీతమతియు సమవర్తియు మంతనము సలిపిన వెనుక సమవర్తి రాయబారిని తన మందిరములోనికి రావించెను. ఆ రాయబారి-
“ఓ సేనానాయకా! వీరాగ్రణీ! నేను నీకు కొన్ని పరమరహస్యముల నెరింగించెదను. నాకు అభయమిచ్చినచో మనవిచేసెదను” అనివాక్రుచ్చెను.
“ఓయీ! రాయబారము నిండుసభలో సలుపవలయును. అయినను నీవు కోరినందున ఏకాంతమనుమతించితిని. రాయబారి ప్రాణ మెప్పుడును సురక్షితము. తుచ్ఛులగు నితరులు ధర్మమునకు దూరు లగుదురేమో కాని ఆంధ్ర వంశము మాది. నేను సాతవాహనుడను. మే మట్టి యవినీతి ఎన్నడును సలుపము. నీ ప్రాణము నీయదియ, చెప్పుము.”
“సమవర్తీ! ఓ నరోత్తమా! మీరు సాతవాహనవంశజులు. చక్రవర్తి కాదగినవారలు. మీకు తెలియని ఆలోచన ఒండెద్దియు లేదు. ప్రతిష్ఠానమున యువరాజు నెవరో నిర్జీవుని చేసినారని మాకు వేగు వచ్చినది. నిజ మరయుటకై అంచెలపై చారులను పంపినాము. రేపు నిజము తెలియగలదు.”
“శాంతం పాపం! ఈ అబద్ధపు వేగు తెచ్చినవాని నాలుక వేయి చీలికలు చేయదగును. ఓయి వెర్రివాడా! ఎవరురా శ్రీకృష్ణసాతవాహనుని సమయించుటకు దెగించినవారు?”
“ప్రభువులు ఆగ్రహింపకుందురుగాక. మా రాయబారము గడముట్ట నడపనిండు. ధనకటకమున ఈ వార్త తెలిసినది. ఆంధ్రప్రభువు యుద్ధ యాత్రకై బయలుదేర సంసిద్ధుడై యుండియు నాగిపోయెను. మీకు సహాయము రాడు. నాల్గుదినములైన వెనుక మీ సైన్యము సమస్తము రూపు మాసిపోవును. మా సైన్యము దినదినాభివృద్ధి గాంచుచున్నది.”
“అయిన నే మందువు?”
“వినుడు, మీరు వీరాగ్రేసరులు, యౌవనవంతులు. మీరు మాలోన జేరిపొండు. మీకు మా రాజభయమిడుటయేగాక ఆంధ్రరాజ్యము సమస్తము జయించి మీ కాధిపత్యము కట్టంగలవారు. మా యొడయనికి స్నేహితులై సేనానాయకులై మీరు ఆంధ్రభూమి పాలించెదరుగాక! మీ రిరువురు ఉత్తర దేశముల జయింతురు. వేదమతోద్ధారకులై రాజసూయమునందు పాల్గొందురు. ఆయన చక్రవర్తి యగును, ఆయనకు మీరు కుడిభుజ మగుదురు గాత.”
“ఏమి ధైర్యము! అటు తరువాత?”
“మీకు రెండు దినములు గడువు ఇచ్చినారు. ఇంతలో మీ సైన్యములు కోట దాటిపోవలయును, ఆయుధములు దిగవిడిచి వెడలవలెను. ఆహార పదార్థములు ఒక్క దినమునకు సరిపడునవి మాత్రమే తీసికొని పోవలయును. మీరు మీ దారిని పొండు, లేదా మాళవేశ్వరునికడకుబోయి అగ్ని సాక్షిగా మిత్రత్వము నెరపుడు.”
అడివి బాపిరాజు రచనలు - 2
. 162 .
హిమబిందు (చారిత్రాత్మక నవల)