Jump to content

పుట:Himabindu by Adivi Bapiraju.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నబండి నాతడు రజ్జువుచే పడవేయ సంకల్పించినాడు. అది అందరును కనిపెట్టలేక పోయిరి. కాశీఘాతముచే అన్న సమదర్శి ఆగడము మాన్పుటయు నామె గమనించెను. అప్పుడామెకు సమదర్శి యనిన మిక్కుటమగు కోపము కలిగినది. తాను పందెముల రంగస్థలములలోని కురికి యా వీరుని కండతుండెములుగ నరికి వేయవలయునని బుద్ధి కలిగినది.

అన్నగారి విజయోత్సాహమున నామె ఉప్పొంగిపోయి సమదర్శిపై కోపము మరచినది. సమదర్శి తాత్కాలికమగు తన నైరాశ్యము నుజ్జగించి, యథారీతి సంతోషిత స్వాంతుడై ద్వితీయ గౌరవములు, బహుమతులు అందుకొనుట నామె గమనించుచునే యుండెను. ఆమె హృదయము వేగమువహించినది. ఆమెకన్నులు ఆర్ధ్రత వహించెను. ఆ విశాలలోచనాల వెన్నెల వెలుగులు ప్రసరించినవి.

“సమదర్శి శాతవాహన ప్రభువు ఎవరు?” అని మహాలి నడిగి ఆ సేనాపతి పుట్టుపూర్వోత్తరములన్నియు తెలిసికొనెను.

విజయి యగు సువర్ణశ్రీ చుట్టును నాట్యముచేయు బాలికలను సమదర్శి గుర్తించుచు, హిమబిందు నాట్యమాధుర్యమును ఓర్వలేనితనమున జూచుచు, తన్ను ఒక విధమగు లజ్జతో, ఒక విధమగు సాభిప్రాయముతో జూచు నాగబంధునికను గమనించుచు, ఎవరీ బాలికయని ఆతడు మనస్సున ప్రశ్నించుకొనెను.

నాగబంధునికను ప్రణయ మలముకొన్నది. గంభీరహృదయకావున నేరికిని తనభావములు వెల్లడిచేయలే దామె! నిట్టూర్పులు, తోచక ఇటు నటు తిరుగుట, తాపోప శమనము చేయించుకొనుట మొదలగు విరహిణీకలాపము లా బాలకు నసహ్యములు. ఎటులైన తాను పాటలీపుత్ర మహాయుద్ధమునకుబోయి, అచ్చట పురుషవేషమున తనపరాక్రమాదులు చూపి సమదర్శి హృదయము చూరగొనవలయును అని ఆ యోషామణి నిశ్చయమునకు వచ్చినది.

సమదర్శి ఉజ్జయినిని సంరక్షించు వినీతమతికి సహాయముచేయ వెడలిపోయెను. అటుల నాతడు వెడలు నని హిమబిందుకుమారియే తనతో చెప్పినది. “సమదర్శిబావ విపరీతకాంక్షకలవాడు నాగబంధూ! అతనికి స్వలాభాపేక్ష మెండు!”

“వట్టి స్వలాభపరాయణు డనా నీయుద్దేశము?”

“అదికాదు. ఆతడు ఉత్తముడు. ప్రాణములకైన వెనుదీయడు. అయినను తనకు జరుగవలసిన గౌరవములు జరిగితీరవలయు నను పౌరుషముకలవాడు.”

“అది తప్పేమి? సంపాదించునప్పుడు మనము యుగములు బ్రతుక గలము అని సంపాదింపవలయునట. వెచ్చించునపుడు రేపు నశింతుము అని యెంచవలయు నందురుకదా!”

“అది నిజమే! కాని మాబావను ఎందుకు ఉజ్జయిని పంపుచున్నారో తెలియునా?”

“నా కేమి తెలియును బిందూ!”

“మానాన్నగారే ఆతడు ఉజ్జయినికి వెళ్ళుటకు కారణభూతులు.”

“మేనల్లునికి సర్వవిధముల సహాయముచేయవలసినదేకాదా?”

“నిజమేకాని నేను మా బావను, మాబావ నన్నును ప్రేమింతుమన్న భయముచే నాన్న సమదర్శి బావను ఉజ్జయినికి పంపించినారు.”

అడివి బాపిరాజు రచనలు - 2

* 160 *

హిమబిందు (చారిత్రాత్మక నవల)