పుట:Himabindu by Adivi Bapiraju.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బహుళ మగు నిట్టి ధర్మస్థాపన కార్యముల చేయుచుండినను స్థౌలతిష్య మహర్షి ఆలోచనలన్నియు తనమనుమరాలు విషబాలిక పైనే యున్నవి. ఆ విషబాలిక తండ్రియగు తనకొమరుడు అకాలమృత్యువశు డాయెను.

విషకన్యక ఏ మహాకార్యమునకై తనయజ్ఞమున సమిధ కానున్నదో యా కార్యము సఫలమగునా? ఈ ప్రశ్నయే యా మహర్షి హృదయమున జాగరిత మగుచుండెను.


33. నాగబంధునికా హృదయము

నాగబంధునిక సంపూర్ణారోగ్యసమన్వితయై నయోషారత్నము. ఆమె కృష్ణానదిని వరదలుపొంగి పరవళ్ళెత్తిపోవుచున్నను అన్నగారితో సమముగ నీదగలదు. గుఱ్ఱపు పందెమున అన్నగారితో సమముగ పరుగెత్తగలదు. తమ ఇంటనే పెరుగుచు తనకు చిన్నన్నవలె నున్న మహాబల గోండు యువరాజుకడ ఆటవిక విద్య నాగబంధునిక అభ్యసించి, అడవులలో సంచరించు మృగములజాడ తీయుటలో, పక్షులకూతల వైచిత్రములన్నియు నవలీలగ చెప్పుకొనుటలో మేటియైనది. అన్నగారితోబాటు చిత్రలేఖనము నేర్చుకొన్నది. సంగీతమున గాత్రగాన మనిన ఆమెకు ఎంతయో ఇష్టము. వీణాదులు తాను వాయింపననియు, అన్నయ, సెల్లెలును వాయించుచుండ విని సంతసింతుననియు నా బాల వచించుచుండును.

మిక్కిలి కోలమోమున విశాల నేత్రములు, సమనాసిక, గంభీర చిబుకము గాంచినచో సువర్ణశ్రీయే పురుషవేషము వేసినా డను భ్రమ కల్పించును.

ఆ బాలిక సూక్ష్మబుద్ధి. ఆమెకు మైత్రేయి, గార్గి, సంఘమిత్రలనిన గౌరవము, సత్యభామ యనిన పరమప్రీతి. స్త్రీ కత్తిపట్టిన గాని లోకమున దుఃఖము నశించ దనును. అన్నతో వాదులాడుచునే ఆ బాలిక పెరిగినది.

స్త్రీ ప్రేమించును. తల్లి యగును. కాని ప్రేమమాత్రజీవన యగు బాలిక స్త్రీ మాత్ర మగునని ఆమె అన్నతో వాదించును.

“స్త్రీవంటి పురుషుడు, పురుషునివంటి స్త్రీయు రోతపుట్టింపరా చెల్లీ!”

“ఓయి వెఱ్ఱి అన్నా, పురుషు డన కారము తినువాడును, స్త్రీయనిన వెన్న తినునదియు అని నీ అభిప్రాయముకాబోలు!”

“అదికాదయ్యా చెల్లిగారూ! స్త్రీ యన పెద్దపులియు, పురషుడన పిల్లియు కావలె నని నీ భావము కాబోలు!”

“అవునుకాబోలు! కాబోలో అనబోలో కాని, ఆడుపులి ఉండకూడదా? వృషభము ఉండకూడదా?”

“అన్నియు ఉన్నవి.”

“కనుకనే స్త్రీయందు కొంత కర్కశత్వ ముండవలయు నని నామతం. మనదేశమునందు స్త్రీలు అలంకారప్రియులు మాత్రమే. పురుషుడు మాత్రము వీరవిహారముల కర్హుడగు నని తలంచుట అనర్ధదాయకము కాదా అన్నా?”

ఇట్టివాదనలు చెల్లెలికి అన్నకును ఎప్పుడును జరుగుచుండెడివి. ఆ స్థితిలో నాగబంధునిక సమదర్శిశాతవాహనుని అన్నతో బండిపందెముల సమయమున చూచినది. సమదర్శిశాతవాహనుడు ఆంధ్రవీరు డని, ఉత్తమ పురుషు డనియు నామె తలంచినది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 159 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)