పుట:Himabindu by Adivi Bapiraju.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రహ్మవాద మటులుంచి ఉన్న యీ దుఃఖమయప్రపంచముననున్న దుఃఖము సమసి పోవుటకు అష్టమార్గము తథాగతు లుపదేశించిరి.”

“స్వామీ! బుద్ధధర్మమునందును సాంఘిక, స్థవిర, చైత్యాదివాదములు వచ్చిన కారణమేమి?”

“ప్రపంచమున ఇట్టివాదములు సర్వకాలముల నుద్భవించుచునే యుండును. సమన్వయము చేసికొనుటయే మానవునివిధి. సర్వధర్మములకు మూలమగు కార్య కారణభావములు గ్రహించినవారికి భేదదృష్టియుండదు.”

ఈ విధము లగు వాదనలు అమృతపాదార్హతులతో సలిపి సలిపి, అష్ట మార్గములలో ప్రేమ అత్యంత శక్తివంతమైనదని నమ్మి సర్వభావములకు, సర్వ ధర్మములకు ఆతడు సమన్వయముచేయ సంకల్పించెను.

బ్రహ్మపదార్థము నొప్పుకొనని వైశేషికము అర్థముకాలేదా? వైశేషికము, సాంఖ్యము, ఉత్తర పూర్వమీమాంసలను ఆర్షధర్మవాదులు సమన్వయము చేసికొనిరికదా? శ్రీకృష్ణ భగవానుడు గీతలయందదియే యుపదేశించెనుగదా? వివిధములైన ఇట్టి యాలోచనలు చంద్రస్వామి నావరించెను. స్వభావ విహితమే స్వధర్మ మనియు, తద్విరుద్ధము పరధర్మ మనియు నిశ్చయించెను. ఆతడు చక్రవర్తికి, సామ్రాజ్ఞికి క్రమముగా సన్నిహితుడై పోయెను.

స్థౌలతిష్యమహర్షికి చంద్రస్వామిచరిత్ర ఎప్పటికప్పుడు తెలియుచునే యున్నది. చంద్రస్వామి అమృతపాదార్హతుల బోధనలకు లోనై తన కర్మకాండలో కొలదిగ మార్పులు తెచ్చుకొనుచున్నాడని తెలియవచ్చెను. చంద్రస్వామి బోధనలచే బౌద్ధసన్యాసుల హృదయములును కొంత కొంత మారుచుండవచ్చును. సద్భావసౌజన్యము లున్నచో అన్నియు సమన్వయ మగును గాబోలు.

ఈ ఆలోచనలతో నా మహర్షి కృష్ణాజినముపై అధివసించి యుండెను.

ఆతనిమహాదృష్టిలో ఆర్షధర్మవ్యతిరేకు లగువారు నాశనమై, ఆర్ష ధర్మము నాలుగు పాదముల నడచును. వైదికధర్మాచరణముచే మనుజులే దేవతా స్వరూపులగుదురు. అట్టి ధర్మప్రచారమే ఆతని తపస్సు. అనార్ష ధర్మనాశనమే ఆతనిదీక్ష.

గంగోత్రి, యమునోత్రి, సింధునదీ జన్మస్థానము, మానససరోవరము, కైలాస పాదములమ్రోల తాను పెక్కు సంవత్సరములు తపస్సు చేసినాడు. నేడు తనసంకల్పము ఈడేరకుండుటెట్లు? జంబూద్వీపమునకు పరిత్రాణము కాకుండు టెట్లు?

చారుగుప్తుడెట్లు బంగారు రాసులు కొండలు కట్టించెనో, స్థౌలతిష్యుడట్లు తన సంకల్పసిద్ధికై కొండలు త్రవ్వించి బంగారమును ప్రోవుచేసెను.

ఆతడు త్రివిష్టపమునను, గంగోత్రిప్రాంతమునను బంగారుగనులు త్రవ్వించెను. కైలాస ప్రాంతీయులైన యక్షు లాతనితో బంగారువర్తకము చేయువారు భక్తులగు వణిక్ శ్రేష్ఠులు, మహారాజులు స్థౌలతిష్యుని వివిధా శ్రమముల ధనరాసులు పోయుచుండిరి. ఈ లెక్కలేని ధనసహాయముచే నాతని యాశ్రమముల మనుష్య, పశువైద్యములు నిర్విరామముగ నడచుచుండెను. ధాన్యకటకమున నమరేశ్వరునకు ఉత్తుంగదేవాలయము నాతడు నిర్మించెను. ఆంధ్రదేశ మెల్లెడల నూతన దేవాలయముల బ్రతిష్టచేసెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 158•

హిమబిందు (చారిత్రాత్మక నవల)