పుట:Himabindu by Adivi Bapiraju.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నగలు నాణెములు ధనధాన్యములతో తులదూగు నాభవనముల చారుగుప్తుని కుమార్తెను, ఆమె ముత్తవను తస్కరించుట కడు విచిత్రమని మరికొందరు, ఇది ఆంధ్ర రాజ్యశత్రువులు సల్పిన కుట్రయని కొందరు, చారుగుప్తునికడ వెల లేని ధనముల సంగ్రహింప మేధావులగు చోర శిఖామణు లొనరించిన కార్య మిదియని కొందరు, చారుగుప్తుని విరోధులెవ్వరో రచించిన మాయ యిది యని కొందరు పరిపరి విధముల చెప్పుకొనుచుండిరి.

పట్టణము కాపాడుచున్న ఉపసైన్యాధ్యక్షుడు కొందరు చమూపతులతో, చారులతో వచ్చియున్నాడు. సువర్ణశ్రీ కుమారుడు నెమ్మదిగా జన సమ్మర్థము ఒత్తించుకొనుచు భవనగోపుర ద్వారముకడకు చేరినాడు. లోనికి వెళ్ళుటకు ప్రయత్నింప ద్వారమున కావలిగాయు సైనికులు అడ్డగించిరి. అతనికి కోపము వచ్చినది.

“ఉపసైన్యాధ్యక్షులతో ధర్మనందులవారి పుత్రుడు సువర్ణశ్రీ వచ్చినాడని చెప్పుడు.”

భటుడు: ఇపుడు వీలుపడదు. కొంచెము తాళుడు. లోన నేమి జరుగుచున్నదో చూచుటకు కుతూహలము పడుచున్న జనులందరు సువర్ణశ్రీ కుమారుని చుట్టును మూగి లోనికి పోనిండని కేకలిడిరి.

ఈ గడబిడ విని యచ్చట తిరుగాడుచున్న దళవాయి యొక డక్కడకు వచ్చెను. అతడు సువర్ణశ్రీకుమారుని గని గురుతుపట్టి లోనికి తీసి కొనిపోయెను. సువర్ణశ్రీకుమారుడు కక్ష్యంతరములు గడచి బాలనాగితో నుపాధ్యక్షు లగు కాకుండకులవారు మాట్లాడుట చూచెను. బాలనాగి యేమో చెప్పుచుండెను.

బాల: మేమిద్దరము చాలాకాలము మాట్లాడుకొనుచు ఆ తోటలో నుంటిమి. ఇంతలో రివ్వుమని నలుగురుమనుష్యులు వచ్చి గుడ్డలు మాముఖములగప్పి నోట గుడ్డలు కుక్కినారు. నాకు మతి తప్పిపోయినది. మరల మెలకువ వచ్చి చూచునప్పటికి నేనా ప్రదేశముననే పడియుంటిని. నా నోట గుడ్డలున్నవి. కన్నులువిప్పి చూతునుకదా హిమబిందుకుమారిక చుట్టుప్రక్కల నెక్కడను లేదు. తూర్పు తెలతెలవారుచున్నది. భయముతో బెద్దకేకలు పెట్టితిని. తోటపనివారు, రక్షకభటులు, కొందరు దాదులు పరుగెత్తుకొని వచ్చినారు. వారితో హిమబిందు కుమారిక ఏదని అడిగితిని. వారు “నీకు మతిపోయినదా! పడకగదిలోనే యుండును. ఏల నీ వీ కేకలు పెట్టుచున్నా” వని అడిగిరి. పరుగుపరుగున అభ్యంతర మందిరమునకు పోయితిని. ఆమె అచ్చటలేదు. వేసినపక్క వేసినట్లే ఉన్నది. పరుగెత్తుచునే రాత్రి జరిగిన సంగతులందరికి చెప్పుచుంటిని. దాదు లిటునటు పరుగెత్తిరి. ఆమె యెక్కడను లేదు. ముక్తావళీ దేవిగారును కన్పింప లేదు. వారితో చెప్పుటకు వగర్చుచు వారి శయనాగారమునకు పోవ అక్కడ తెరలు చిందరవందరగా నుండెను. రత్నకంబళిపై బురదతో ఉన్న అడుగుల చిన్నెలు కాన్పించినవి. ఇరువురిని చోరు లెత్తుకొని పోయినారని గగ్గోలు బయలు దేరినది.

కాకుం: భవనోద్యానవనములో నే వైపున ఇది జరిగినది?

బాల: ఉత్తరమున మాలతీలత పొదరిండ్లకడనున్న చంద్రశిలావేదిక పక్కనున్న లతామంటపములో కూర్చుండియుంటిమి.

సువర్ణశ్రీ కుమారుడచ్చటికి బరువిడెను. అచ్చట చిందరవందరగా అడుగుల జాడలు కాన్పించినవి. అయ్యవి కోటగోడవలెనున్న భవన బాహ్యకుడ్యములవరకు నున్నవి. అచ్చట హిమబిందు వస్త్రమునుండి చిరిగినముక్క కన్పించినది. అప్పు డక్కడ కొందరు

అడివి బాపిరాజు రచనలు - 2

. 154.

హిమబిందు (చారిత్రాత్మక నవల)