పుట:Himabindu by Adivi Bapiraju.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 “అమ్మా చిన్నమామయ్య ఒకటి, రెండు నెలలో సముద్రప్రయాణము చేసి సువర్ణ దీపముదాటి యవద్వీపమునకుపోవునట. అచట జయశ్రీ శాతవాహన మహారాజు ఒక మహాచైత్యము నిర్మింపజేయ నున్నాడట. ఆ చైత్య నిర్మాణశిల్పి కులపతిగా చిన్న మామయ్యను సగౌరవముగ మహారాజు ఆహ్వానించెనట. నేను మామయ్యతో యవద్వీపముపోవ సంకల్పించు కొన్నాను.”

“అమ్మయ్యో, సముద్ర ప్రయాణమే! మా తమ్ముడు వెళ్ళుటయే? వాడు వట్టి వెఱ్ఱివాడు. వెళ్ళవద్దని మీ అక్క ఆజ్ఞ యిచ్చుచున్నదని చిన్న మామయ్యకు తక్షణము లేఖ వ్రాసి గజవార్త పంపుము.”

“సముద్రయానమంటే అంతభయ మేటి కమ్మా? దివ్యశ్రీ సంఘ మిత్రా దేవి ధర్మము దిశలన్నియు ప్రసరింపజేయ సింహళాది ద్వీపములకు పోలేదా?”

“బాబూ! యీ వెఱ్ఱిమాటలు మాటలాడకు. నీకు దేశములే తిరుగ వలయునన్న గయాది క్షేత్రములకు పొమ్ము.”

“మెట్ట ప్రయాణము ముసలమ్మ చేయగలదు. ఓడ ప్రయాణము భయమా? ఏదో ఒకటో రెండో తప్ప తక్కిన ఓడలన్నియు సురక్షితముగ ప్రయాణము సాగించుటలేదా అమ్మా!”

“నిన్నమీనాయనగారు పంపిన ఉత్తరము చూచినావుకదూ నాన్నా?”

ఇంతలో మహాలి వేగమున వెల్లనగుమోమున అచ్చటకు పరువిడి వచ్చినది, ఆమెకు మాటరాలేదు. “హిమబిందు.....” అని కేకవేసినది. శక్తిమతియు, సువర్ణశ్రీ కుమారుడును ఇరువురు నులికిపడిరి. సువర్ణుని గుండె కొట్టుకొన్నది. ఏ మది! ఆమె వచ్చుచున్నదా?

శక్తి: హిమబిందు....

మహాలి: దొంగలు ఎత్తుకొనిపోయినారు.

సువర్ణ: (పెద్దగొంతుకతో) ఎవరిని?

మహాలి: హిమబిందును!

శక్తిమతి: ఎవరినీ?

మహాలి: హిమబిందునమ్మా! చారుగుప్తులవారి కూతురును!

సువర్ణ: ఓసి నీ ఇల్లు బంగారముకానూ! వెఱ్ఱి వెఱ్ఱి మాటలు మాటాడక తిన్నగా చెప్పు.

మహాలి: కాదమ్మా, నిన్నరాత్రి యెనిమిదినాళికలు మ్రోగినప్పుడు.... ఎలా వచ్చారో.....హిమబిందుకుమారికను దొంగలు ఎత్తుకొనిపోయినారట!

శక్తిమతి: ఆఁ! ఆఁ! ఎంత విడ్డూరం!

మహాలి: ఆమెను, ఆమె ముత్తవతల్లినికూడా ఎత్తుకొనిపోయి నారట.

శక్తిమతి: బాబూ! అది యేమిటో తిన్నగా కనుక్కురా! ఏమిటో అంటుంది. అక్కడ సువర్ణశ్రీ కుమారుడు లేనేలేడు.

శక్తిమతి: అప్పుడే తుఱ్ఱున మాయమయినాడు. చెప్పినది నిజమేనా?

మహాలి: ఒట్టుతల్లీ! పట్టణమంతయు గోలగా చెప్పుకుంటున్నారు.

సువర్ణశ్రీ కుమారుడు చారుగుప్తునిభవనమున నొక్కయంగలో వ్రాలినాడు. జనులు ఇసుకరాలనట్లు అక్కడ మూగియుండిరి. రక్షకభటులు కావలియున్న చారుగుప్తుని భవన మెట్లు చేరిరని కొందరు, కక్ష్యాంతరము లన్నియు గడచి వారు లోనికెట్లు వెళ్ళిరని కొందరు,

అడివి బాపిరాజు రచనలు - 2

• 153 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)