పుట:Himabindu by Adivi Bapiraju.pdf/162

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నిలిచెను, పూర్ణాహుతిని మంత్రవేత్తలు అర్పించిరి. మంత్రాగ్నికిని, భగవంతునకును నీరాజనము సమర్పింపబడినది. జేగంటలు మ్రోగినవి. స్థౌలతిష్యుడు అచ్చటినుండి వెడలిపోయెను.

విషకన్యక చైతన్యరహితయై సర్వమును మరచి ఆ విగ్రహము మ్రోల పడియుండెను. ఆమె చేతులా శివలింగమును చుట్టియున్నవి. భయంకరుడైన మృత్యుదేవునకు భయపడిన బాలకుడగు మార్కండేయునివలె విషకన్య కాల కాలుడైన శివునే శరణుజొచ్చినట్టయినది.

యుగయుగాలనుండి వచ్చు ఆర్యర్షి ప్రతిభా ప్రవాహమున పుట్టి పెరిగిన కమల మా బాలిక. ఆమెలోని చైతన్య మొక్కపరి స్పందించినది. వ్యక్తావ్యక్తమై ఆమె జ్ఞానము వికసించినది. సర్వభూషణాలంకృతయై, దుకూలాంబర ధారిణియై, విరచితద్వివేణియై, దహింపబడిన మన్మథునిసతి రతీదేవివలె ఆమె అచ్చట పడియుండెను.

తమోమయమైన ఆమె అంతరాకాశమునందు చీకట్లు కదలినవి. దూరదూరమున ఎచ్చటనో మిణ్కుమిణ్కుమను కాంతి కన్పించినది. ఆ వెలుగు పెరిగి పెరిగి శీతలప్రసన్న ద్యుతులు వెదజల్లుచు తనగర్భమున దాగియున్న బాలేందు శేఖరునిమూర్తిని స్పష్టమొనరించినది. అతడు తియ్యని మాటల,

“చంద్రబాలా! నీవు నాశరణుజొచ్చితివి. నీవు నేటినుండి అమృత కలశవిగాని మృత్యుశిలవు గావు. బుద్ధుడేమి, వీరుడేమి ఎవరైనను నా ఛాయలు మాత్రమే. ఇవియన్నియు నావిలాసములు. అనుగ్రహింపబడితివి పొమ్ము” అనుమాటలు ఆమెకు వినంబడి నట్లయినది.

విషకన్య చటుక్కున లేచినది. చిరునవ్వు ఆ మోమున శాంతద్యుతు లీనినది. ఆమె లేచి తలవంచుకొని బసలోనికి నడచిపోయినది. ఆమె వెను వెంటనే గగనియు కాశ్యపియు వెడలిపోయినారు.

30. పరాస్కంధము

సువర్ణశ్రీ మనస్సునకు ఊరటలేదు. వేదనాదోదూయమానమగు మనస్సులో, బుద్ధిలో, హృదయములో ప్రళయకాల ప్రభంజనములు, ఎడతెరిపి లేని బడబానల దావానలములు నెసరేగుచున్నను మహాగ్నిగర్భమగు పర్వతమువలె పైకి శాంతుడై నిర్వికారునివలె తిరిగి ఇంటికి విచ్చేసెను.

ఆ గ్రీష్మదినమున ధాన్యకటకము మరియు మండిపోవుచున్నది. సాయంకాలమైనను మలయానిలములు తిరుగలేదు. నగరవాసులందరు గృహముల నుండలేక నదియొడ్డుకు పోవువారును, ఉద్యానవనముల కేళాకూళులకడ గూర్చుండు వారును, శీతలోపచారములు చేసికొనువారు నై యుండిరి.

క్రిందటిదినముననే ధాన్యకటకముచేరిన సువర్ణశ్రీ సాయంకాలమున కృష్ణా తీరమున సంచరింపుచు ఇంటికిపోవు హర్షగోపుని దూరమున జూచినాడు. ఆ హర్షగోపుని బిలిచి మాటలాడవలయు నను కాంక్ష సువర్ణునకు పొడమినది గాని సిగ్గుపడి అటులనే నడచిపోయినాడు. మరునాడు ఉదయమున సువర్ణశ్రీకుమారుడు లేచి పెఱుగులో వెన్న తీయించుచున్న తల్లికడకు వెళ్ళినాడు.

అడివి బాపిరాజు రచనలు - 2

• 152 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)