పుట:Himabindu by Adivi Bapiraju.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏ అనంతార్థములో ఏ క్షణిక భావములో
నీ అంగహారముల నృత్యాభినయము లగు
ఆడవే కల్యబాలా!
వచ్చితివి, ఇంతలో చొచ్చితివి నాబ్రతుకు
మెచ్చుచుండగ గచ్చు విచ్చౌదువే బళీ!
ఆడవే కల్యబాలా!

“పాట బాగుంది దొరా. ఈ తళుకు లంతలో వెలిసిపోతవి.”

“అడుగో సూర్యభగవానుడు. కలలు కల్లలుచేసే దైవము.”

ప్రేమ క్షణికమూ, బాధ నిత్యమూ నగునా? కాదు. ప్రేమయే ఈ బాధగా నిలిచినది. కనుకనే యీ బాధ యింత మధురము.

వారి పడవ ఇంకను సాగిపోయినది. అంతులేని పడవయాత్ర చింతలేని బ్రతు కెటు లగు?

ఆ కల్లోలములో, ఆ తెరచాప పొంగులో, ఎరుకవీడక నావ నడుపుకొనుచు, మిలమిలలాడు చేపలను వలవైచి పట్టుకొను ఈ బెస్తలే నిజమగు తత్వజ్ఞులని సువర్ణశ్రీ యనుకొనినాడు.

సాయంకాలమునకు ద్రోణి తిరిగి కృష్ణాతీరము చేరినది.

24. పరివర్తనము

విషబాలయు, స్థాలతిష్యుడును, తక్కినవారు ధాన్యకటకమునుండి ప్రతిష్టా నగరమునకు బోకముందు ఒక విషయము జరిగినది. ఆశ్రమమునకు కృష్ణాతీరమునం దున్న కుడ్యముప్రక్క ఒక చిన్నతోట యున్నది. అందొక కర్షకుడు కాయగూరలు పండించు చుండును.

ఆంధ్రదేశమునందీ దినములలో నేమి పంటలు పండించుచుండిరో ఆనాడును ఆ పంటలే నేటి వ్యవసాయ విధానములనే పండించుచుండిరి. కృష్ణవేణ్ణా గౌతమీ నదుల మధ్యనున్న శాలిభూములు, ఈవ లావల నున్న భూములు వరి, జొన్న మొదలగు పంటలచే నిండియుండెను. సెనగలు, పెసలు, కందులు, మినుములు, నువ్వులు, ఆవాలు, ధనియములు, మిరియములు, ప్రత్తి, గోధుమలు, అలచందలు, కొర్రలు, అవిసెలు, యవలు, చెఱకు విరివిగ పండుచుండును. మనుష్యుడు కృషి చేయు భూములేగాక దేవభూము లనునవి కలవు. అందు విత్తులునాటుట తరువాయిగ ధాన్యము విరివిగ వివర్తనమునకు రెండు మూడు ద్రోణములు (పుట్టులు) పండెడివి.

ఆంధ్రదేశమునం దున్న ధాన్యపుబంట జంబూద్వీపమునం దెచ్చటనులేదు. అందుకే ఆంధ్రరాజధానికి ధాన్యకటక మని పేరు వచ్చినది. వరిచేలు కోత అగుచుండుట తడవుగ జనుము చల్లువారు. వరులు మనుష్యుని ఎత్తు పెరిగెడివి. జను మంతకన్నను విరివిగ పెరిగెడిది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 136 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)