పుట:Himabindu by Adivi Bapiraju.pdf/136

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


జీవింపగలడా? దుర్విధీ! తన్ను గోటీశ్వరుని తనయ నేల చేసితివి? కోరిన వరుని జెట్టపట్టలేని నిర్భాగ్యురాలికీ యైశ్వర్యమంతయు నేటికి? తన్ను పరమదరిద్రురాలినైన జేయుము; తన స్వామినైన జేర్పుము. ఈ యాంధ్రసామ్రాజ్య వైభవము, ఈ జైత్రయాత్రలు తనకొఱకే కల్పితములైనట్టు లున్నవి. దైవముగూడ తండ్రి సంకల్పమునకే తోడై ఆంధ్రసామ్రాజ్యమున కీ విజయపరంపరలు సమకూర్చవలెనా? ఈ యాంధ్రసామ్రాజ్యము గాని, చారుగుప్త ఐశ్వర్యముగాని ఏ మహేంద్రజాలముచేనైన గొంతతడ వస్తంగతమగునేని తనకీ సంకటము తప్పిపోవును.

“బుద్ధదేవా! నీవేశరణు. అబలను, అల్పబుద్ధిని నాకు మార్గము జూపుము, నా స్వామిని రక్షింపుము తండ్రిసంతోషమా, మా యిరువురి సౌఖ్యమా?”

ఈ దీర్ఘ విచారమువలన నేమి ప్రయోజనము? ఏది యెట్లు కానున్నదో అట్లగును.

తుదిసారి ఆ పవిత్రమూర్తిని, ఆ యకలంక సుందరుని, చిరుమబ్బుముంగురులు మూగు నుదుటివానిని, సర్వదిశలే మూర్తీ భవించి సర్వకాంతులే పుంజీభవించి వెలుగు కన్నులవానిని, శిల్పదీక్షితుడగు ఆ మనోహరు నొక్కసారి దర్శించి ఆతనిపాదములు కన్నులకద్దుకొని, కడసారి కడసారి చూపు చూచి, అతనికడ సెలవుపుచ్చుకొందును. తరువాత భారము తండ్రిది, భగవంతునిది.

ఆమె మెల్లమెల్లగా తోటలోనికి అడుగులిడినది. పూవులు అంద ముల నొలుకబోసుకొనుచున్నవి. వసంత, గ్రీష మధ్యస్థమగు ఆ దినములు మృదు మధురములై మత్తిలజేయుచున్నవి. కలలోవలె ఆ తోటలో చరించుచున్నదాబాల. బాలనాగితో మాటలాడదు. ఏదియో పూవు గోయును. అది బంగారు సజ్జలో వైచును.

ఇంతలో సుడిగాలివలె, గ్రహణమువీడిన సూర్యుని కాంతివలె, వేసవి సాయంకాలమున చుటుక్కున తిరిగిన సముద్రజంఝానిలమువలె, నిధుల దెరచిన రత్నముల కాంతివలె నెచ్చటి నుండివచ్చెనో సువర్ణశ్రీ కుమారుడు హిమబిందును బిగియార కౌగిలించుకొని తనహృదయమున కదిమివేసికొనెను.

అప్రయత్నముగా హిమబిందుచేతు లాతని చుట్టివేసినవి. దివ్యసురభిళగాఢ పరిష్వంగములోవారిరువురును సర్వమును మరచిపోయిరి. బాలనాగి చల్లగనొక పూలపొదరింటిమాటున నిలుచుండిపోయినది. తండ్రిమాటలన్నియు మాయమైపోయినవి. ఆ పవిత్రక్షణ మొక విశ్వమే అయినది. ఇంతలో ఆ మధురాతిమధుర వైవశ్యమునుండి ఆమెకు మెలకువ వచ్చినది. ఆమె చటుక్కున ఆతనికౌగిలి సడలించుకొని దూరముగబోయి కన్నులవెంట జలజల బాష్పబిందువులు ఒలికిపోవ నవనత వదనయై నిలిచినది. పూలసజ్జలోని పూలన్నియు నేలపై నొలికిపోయినవి.

సువర్ణశ్రీ అత్యంతాశ్చర్యము నొంది యామె గాఢవిషాదమును పరికింపుచు “ఏమిది హిమా!” అని దగ్గరకు చేరి యామెభుజముపై చేయివైచెను. ఆ స్పర్శతో ఆమెకు మరల మెలకువ వచ్చెను. ఆతని చేతులు నెమ్మదిగ భుజములనుండి తీసివేసి వెనుకకు జరిగి “ఈ జన్మమునకు ఇది తుదిసందర్శనము. ఏ పాపపు విధి బలవత్తరాదేశముననో యీ విషాదసంఘటన మన కిరువురకు సంభవించినది” అని యెలుంగు రాలుపడ పలికి శోకావేగమున మారు మోమైనది.

“ఏమి, హిమా! నీవు నాతో మేలమాడుచున్నావా? నన్ను పరీక్ష చేయుచుంటివా? సర్వభూతములు, సర్వదేవతలు సాక్షిగ చెప్పుచున్నాను. జన్మజన్మలకు నీవే నా ఆత్మేశ్వరివి.

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 126 •