పుట:Himabindu by Adivi Bapiraju.pdf/135

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రతి శుక్రవారపు ఉదయమునను హిమబిందు చతుర్విధపురుషార్థ దాయిని అయిన మహాలక్ష్మికి పూజ సేయును. ఏ ధర్మము లెటుపోయినను వణిక్కులు మహాలక్ష్మీపూజ మానరు.

మహాలక్ష్మీ వణిజులయింట నెన్నడో వెలసినది. ఆ దేవి వణిజుల యాడుపడుచు. హిమబిందు శుక్రవారము ఉదయమున లేచును. చంపక, మల్లిక, దమనక, వకుళ, కేతకీ ప్రముఖ తైలములతో, పుప్పొళ్ళనలుగులతో పరీమళ జలంబుల నభ్యంగన మాచరించి, సుదీర్ఘకుంతలముల చిక్కుతీయించుకొని, వదులు వాలుజడ వేయించుకొని, పూజావస్త్రములు ధరించి, బంగారు పూలసజ్జతో తోటలోనికి బోవును.

మహాలక్ష్మీపూజకు ఆమెయే పూవులు, పత్రి కోయవలెను. ఈ శుక్రవారపు టుదయమున ఆమె బాలనాగిని వెంటగొని పుష్పోద్యానమునకు బయలు దేరినది. శుక్రవారము ఉదయము ఆ ఉద్యానవనమునకు రమ్మని బాలనాగి సువర్ణశ్రీకి సందేశ మంపినది. తానేమి చేయవలెను? “ఓ మహాశిల్పీ! దివ్య సుందరమూర్తీ! నీకును నాకును ఇంతటితో చుట్టరికము చెల్లిపోయినది” అని చెప్పవలయునా? ఈ బాలకుని, ఈ మనోహరుని, ఈ దేవతామూర్తిని ప్రేమింపక తాను బ్రతకలేని మాట నిశ్చయము. తన హృదయమప్పుడే స్థాణుత్వము వహింప నారంభించినది. ఈ రెండు మూడు దినములలోనే తాను చిక్కిపోయినది. భోజనము సహ్యమగుటలేదు. దేహమునకు, మనస్సునకు, ఆత్మకు ఈశ్వరుడైనవాని వదలి పరపురుషుని ఏ స్త్రీ స్పృశింపగలదు? నాయకునిగా భావింపగలదు? అతడు మహారాజగుగాక, చక్రవర్తియగు గాక, భగవంతుడే యగుగాక!

తండ్రి యాజ్ఞను తాను జవదాటలేదు. ప్రత్యక్ష భగవంతుడు తండ్రి గాదా! తన జీవితమున కాధారభూతుడు జనకుడు. అతని ప్రతిరూపము తాను. ఆయన ఆజ్ఞ తనకు అనుల్లంఘనీయము! అయిన నేమి? ఎవరి మనస్సువారిది. ఎవరి ఆత్మ వారిది. తనతండ్రి యాజ్ఞచే తాను మహారాజ శ్రీకృష్ణ శాతవాహనుని ప్రేమింపగలదా? అయినను తండ్రికీ వెఱ్ఱి యేమి?

ఎట్లు సువర్ణశ్రీని విడిచి తా నుండగలదు? అతనికన్నులలో తన చూపులు విరియింపక, ఆతని దేహకాంతులలో తనజీవకాంతులు మలచివేయక, ఆతని మాటలకు తన హృదయమును శ్రుతిచేయక, ఆతని ఆత్మలో తనాత్మ లయింపక మందభాగ్యయై ఎట్లు మనగలదు? జనకుని యాసలన్నియు తనపై నున్నవి. ఈ కుబేరసంపదయు, ఈ మహదైశ్వర్యము చాలదా తనకు తనభర్తకు? మహారాజమహిషినై ఇంకను బ్రామి కొనునది యేమి? సువర్ణశ్రీ విముఖమై, వాడబాఱి, ఎండిపోయిన తనహృదయమునకు మహారాజప్రాభవ మేమి రుచించును? అయ్యో! తండ్రికీ విషయమంతయు చెప్పుటెట్లు? తన ఏకపుత్రిక ఆంధ్ర సామ్రాజ్యసింహాసన మధిష్ఠించునని పుట్టెడాసతోనున్న ఆ వృద్ధుని హృదయము తననిశ్చయము విన్నచో భగ్నముకాక నిలుచునా? మదేకగతియై, నన్ను బూవులలో నుంచి పెంచుచున్న ముదుసలి తండ్రి మాట కెదురాడి, ఆయనకు బ్రాణాం తకమైన ఘాతుకకృత్యము నే నెట్లు చేయగలను? తండ్రి జీవితమునకిక మిగిలినది తన వివాహ సంతోష మొక్కటియే కదా! నా సౌఖ్యమునకై తండ్రిహృదయము భగ్నము చేయజాలను. బుద్ధదేవా! నీవే శరణు. నన్నును, నా జనకుని ఎట్లు రక్షింతువో!

అక్కటా! తన సౌఖ్యము, తనతండ్రి సంతోషమేగాని తనహృదయాధినాధు డగు సువర్ణసుందరుని మాటయే మఱచినది. తన్ను విడిచి తన స్వామి యొక ముహూర్తమైన

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 125 •