పుట:Himabindu by Adivi Bapiraju.pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వచ్చినది. విష్ణునకు సముద్రుడు లక్ష్మీనర్పించినట్లు, నిన్ను శ్రీకృష్ణశాతావాహన మహారాజుకు అర్పింప సంకల్పించుకొన్నాను. సంకల్పమును పెద్దలందరు ఆమోదించినారు.”

17. నాయికా నిర్వేదము

చారుగుప్తుడు తన కొమరిత వెలవెలబోవుట జూచినాడు. ఆమె నిశ్చేష్ట అయినది. విప్పారిన పూలమాలవలె తన చేతులలో నున్నది యున్నట్లే ముడుచుకొని పోవుచున్నది.

చారుగుప్తుడు “బాలనాగీ” అని పెద్ద కేకవేసెను.

ఇంతలో మెఱుమువలె బాలనాగి యచ్చట కురికి హిమబిందును జూచి, “అమ్మో! అమ్మాయిగారూ!” అని హిమబిందు దగ్గరకు పరువిడెను.

చారుగుప్తుడు “వెంటనే పన్నీరు పట్టుకురా, వైద్యుని పిలిపించు” అని కేకవేయుచు, తనయ శరీరము నిమురుచుండెను.

బాలనాగి ఒకనిమేషమున పన్నీరము మంచునీటిలో సుగంధజలముల కలిపినది తెచ్చి చారుగుప్తుని చేతి కిచ్చి, అచ్చటనున్న ఘంటికను గబగబ మ్రోగించెను.

పలువురు సేవకురాండ్రు పరువిడివచ్చినారు. బాలనాగి “వైద్యుడు” అని ఒక్క కేకతో వారివైపు తిరిగి అన్నది.

చారుగుప్తుడు పన్నీరముతో హిమబిందు మోము తడుపుచుండెను. ఆమె కన్నులు విచ్చి సన్నని యెలుగున “ఏమి జరిగినది నాన్నా! ఏమిటీ గడబిడ” యని అడుగుచు లేవబోయినది.

చారుగుప్తుడు “తల్లీ లేవకుము. నీకు కొంచెము పైత్యముచేసి కన్నులు తిరిగినవి. కొంచెము విశ్రమించుము” అనుచు కొమరితను బుజ్జగించుచు తలపై పన్నీటిని నెమ్మదిగ శుభ్రవస్త్రములతో నద్దుచుండెను.

పది విఘడియలలో మహావైద్యుడగు ఆనందులవారు చటుక్కున లోనికి విచ్చేసినారు.

చారుగుప్తుడు లేచి అత్యంత వేదనాభరమైన చూపులు వైద్యునిచూపులతో వియ్యమందించినాడు. ఆనందులవారు నవ్వుచు హిమబిందుకడకు బోయి యామె మంచముపై కూరుచుండి యామెఎడమచేయి తీసికొని వ్రేళ్ళువిరిచి, నెమ్మదిగ నామె నాడిని పరీక్షచేసెను.

అంత నానందులవారు లేచినారు. వెనువెంట శిష్యుడొకడు కొని వచ్చు దంతపు బెట్టెను తనకడకు తీసికొనిరమ్మని సైగచేసి, యా పెట్టితెరచి, యందుండు బంగారపు కండరములలో నొక చిన్న బరణి తీసి, తమలపాకును, తేనెను తెమ్మని బాలనాగితో చెప్పెను.

ఆ బరణియందున్న చూర్ణమును చిరుదంతపు పుడకతో తీసి, యది తమలపాకుపై వైచి, తేనెబొట్టు లిరువది లెక్కపెట్టిపడనిచ్చి, యా చూర్ణమును తేనెతో రంగరించెను. రంగరించిన తన యనామికను తమలపాకుపై తుడిచివైచి, హిమబిందును లేచి కూర్చుండుమని కోరి ఆ ఆకును ఆమె చేతికిచ్చెను. ఆ బాలిక మందును సేవించి, ఆకును బాలనాగిచేతి కొసగ నామె దానిని ముక్కలుగ చింపి, ఆవల పారవైచి వచ్చెను.

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 119 •