పుట:Himabindu by Adivi Bapiraju.pdf/119

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఒక్క పొదరింట నాతడు చతికిలబడినాడు. ఆతని విశాలవక్షము పొంగి పోవుచున్నది. వనమున విహరించు వసంతునివలె ఆ ప్రదేశమున ప్రణయ కాంతులతో తేజరిల్లి పోయినాడు.

చీకటి మందమంద తమోహాసముల తనబాహుల జాచి కదలి వచ్చుచు విపుల వృక్షముపై నెల్లర నిదురింపజేయ తలంపుగొని తూర్పున నుదయించినది. ఆ సమయంబున నిరువురు బాలిక లొయ్యారపునడకల నా వనవాటికలోని కరుదెంచిరి.

ప్రేంకణిత తనులతతో విస్ఫారిత నయనములతో నిటునటు చూచుచు వెనుకాడుచు వచ్చుచున్న హిమబిందు వికసించిన పుష్పమైపోయినది.

ఘల్లుఘల్లు మను చప్పుడు చెవి నెటులసోకినదో సువర్ణశ్రీకుమారుడు సముద్ర తరంగమువలె లేచినాడు. ఒక్క యుదుటున వారికడకు పోవువాడై అంతలో కొంచెము సంకోచించెను. “ఎట్టకేలకు, ఎట్టకేలకు” అని వాని యెడద పెదవులు తడిసికొన్నది. ఎక్కడ హిమబిందు! తా నెక్కడ! సుందరాంగులలో సుందరాంగియై, వైభవమున మహాలక్ష్మియై, తారాదేవి యైన ఆమె తనకడకు వచ్చుచున్నది. సంకేత ప్రదేశమున కా బాలిక లిరువురు వచ్చినారు. సువర్ణకుమారు డచ్చట మన్మథాకారుడై నిలిచియుండెను. హిమబిందు ఆగిపోయినది. కొన్నినిముషము లెవరును మాటలాడలేక పోయిరి.

ప్రేమకు మాటలు రావు. పరస్పరము వలచిన పడుచుజంటల తొలి సమాగమము. అది యెక మధురానుభూతి. ప్రేమపూర్ణమైన హృదయములలో తలపులకు, మాటలకు చోటెక్కడ? వా రిరువు రొకరినొకరు చూచుకొన్నారు. చూచుకొనుచు నట్లే కొంతతడవు నిలిచిరి. చూపులకు మాటలు వచ్చునేని వారా ముహూర్తమున ఎన్నివేల గ్రంథమో మాటలాడిరి. వారి హృదయములు పలుకరించుకొన్నవి. చేతులు పెనవైచి గాఢాశ్లేషసుఖ మనుభవించినవి. ఆ వైవశ్యమున వారిరువురు గనులుమూసిరి. మోడ్పుగనులతో నొండొరుల విలోకించుకొనిరి. ఆ యంధవీక్షణములు రెండును ఒక్కటియై ఇరువురను ఒక్కటిగా చూచినవి. ఆ యొక్క వస్తువును వెలుపలిదిగా చూడలేదు. రెండవ వారిని తమలోనే చూచిరి. ఆ చూపులో తుదకుతాము కనిపించక రెండవవారే తామై కనుపించిరి. ఆ క్షణమున సువర్ణశ్రీ, హిమబిందు అను నిరువురు లేరు. ఆ విచిత్రానుభవము నుండి తెప్పిరిలి, కన్నులుతెరచి చూచునప్పటికి హిమబిందుకు విశ్వమంతయు సువర్ణశ్రీమయమై తోచెను. సువర్ణశ్రీకి సర్వము హిమబిందువై కాన్పించెను. ఆ విచిత్రలోకమున బాలనాగి పలాయనము చిత్తగించెను.

ఆవల నిశ్చలమై, నిరంతరమై సాక్షీభూతమైన కృష్ణాప్రవాహము, పైన వినీలాకాశము తారకానేత్రము అప్పుడే విప్పుచున్నది. చెంతను తమపై శాఖాబాహువులు చాచి పుష్పషాతల సల్లుచున్నగున్నమావి. అపుడు వార లొకరినొకరు చూచుకొనిరి. ఇరువురు నొక్కసారి మందహాస మొనర్చుచు చేతులు సాచిరి. చెట్టలుపట్టి ఆ గున్నమావిక్రింద నొరసికొని కూరుచుండిరి. చిఱుగాలికి గున్నమావి యాకులు గుసగుసలువోదొడగెను. కృష్ణవేణి తటమున చిఱు కరళ్ళు జిలిబిలిపలుకు లాడజొచ్చెను. “బిందూ! ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు? ఎచట నుంటివి ప్రాణమా, యిన్నియుగములు? నీ కొఱ కెంతవెదకీతిని? ఎంత తపించితిని?” అనుచు సువర్ణశ్రీ యా జవరాలినెమ్మోమును మరల తనివోని చూపుల జూడజొచ్చెను.

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 109 •