పుట:Himabindu by Adivi Bapiraju.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


కుహుకుహూ కుహుకుహూ
ప్రణయకోమలి నీకు
ప్రణతు లిచ్చెడు వనము
తృణశూన్య పుష్పాల
తృణనీల పక్షాలు
వణికాడు గీతికలతో (కుహు)


పికాంగన:

శారదావల్లకీతంత్రీస్వనము నేను
నాకంఠగత సుధానాదాలలో సుళ్ళు
నందబాలుని వేణునాదాల చెల్లెళ్ళు


కృష్ణానది:

ఔనే వనప్రియా!
నా నీలవేణి కానైగనిగ్యమ్ములో
నాగమన వేగాల నవ్యనటనమ్ములో
తలచూపె నీరూపు
మొలకెత్తె నీ పాట!


భృంగము:

జుం జుం జుం ! భం భం భం !
ఏ నాటివో మనసులో నాటె వాసనలు
అవని సర్వము వసంతారామమై
వన్నె వన్నె పూలై, పైడిదొన్నెలై
తేనియులక్రోవులై
నను బిలచె
ఆరగింతును గొదదీర, మనసార!


సంధ్య:

కృష్ణవేణీ నీలిమలు, కో
కిలలగొంతుల తీయనలు, అళి
కుల గరుత్తుల మిలమిలలు, నా
వెలుగునీడల, వన్నెవన్నెల
విలసనమ్ముల గలసి యాడును
తొలకి పాడును.


12. కృష్ణవేణీ తీరము

సువర్ణశ్రీకుమారుడు హృదయము దడదడ కొట్టుకొన సమశ్రుతి నందిన సంధ్యాకాశమును, నదీప్రవాహమును చూచుచు ఆ వనము ప్రవేశించినాడు. కృష్ణవేణి వినీల జలంబుల నెరసంజ ప్రతిఫలించుట నాతడు చూచెనో, లేదో! కోకిలామధురగీత మతడు వినలేదు. మల్లెలు, శేఫాలిక, హేమపుష్పము, అతి ముక్తము, జాజి, మాలతి, మాధవి, నవమాలిక, కుందము, కరవీరము విరియబూచి యున్నవి. ఆతడు వానిదెస చూడలేదు. అతనికోర్కె ఎఱ్ఱనైనది. అతనిగండఫలకములు చిరుచెమ్మటలు వోసినవి.

అడివి బాపిరాజు రచనలు - 2

• 108 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)