పుట:Himabindu by Adivi Bapiraju.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనతిదూరమున నున్న బాలనాగి పరుగున వచ్చినది. హిమబిందు ప్రేమ వైవశ్యమును, స్నేహప్రసన్నతయు చూపుల నుట్టిపడ “నా ప్రాణములు నీ చేతిలో నున్నవి” అని దాని భుజముపై చేయివేసెను. బాలనాగి నిమిషమున ఆమె భావము అర్థము చేసికొన్నది.

బాల: అమ్మా! నే నవశ్యము ఒక కార్యము నెరవేర్చెదను.

హిమ: ఏ మది?

బాల: మీ రూరకుండుడు. సాయంకాలము క్రీడోద్యాన విహారము.

***

సువర్ణునిహృదయమున చందన మలిమిపోయినది. చల్లని మలయ పవనములు ప్రసరించినట్లయినది. తన శిల్పములు, చిత్రములు అన్నియు ఆనా డామె మరల నెంతో మోదముతో తిలకించినది. ఆమె కన్నులు ఎండలోని హిమబిందువులవలె మిలమిలలాడి పోయినవి. తనప్రక్క ఆమె నడుచునప్పుడు, తా నామెను శైబ్యసుగ్రీవకములకడకు గొనబోవునప్పుడు, వాని నామెకు కాననిడినప్పుడు, ఆ కాన్క నామె వల దనుచు మంద హాసమున నెట్ట కేల కంగీకరించినప్పుడు తాను లోకమే మరచినాడు. ఆనందమే తానయినాడు. హిమబిందు శిల్పము విన్యసించుచున్నాడు. సౌందర్యాధిదేవత ఆ శిల్పమున వెలయుచున్నది.

ఇంతలో నాగబంధునిక అక్కడికి వచ్చినది. “అన్నయ్యా! సంజ చీకటివేళ కృష్ణానదీకూలమున చారుగుప్తులవారితోటలో ఉత్తరపుగున్న మావికడ కూర్చుండి కృష్ణానది ప్రవహించుట కనుగొన్నచో ఎంత సుందరము, ఎంత విచిత్రము” అని యూరించినది. సువర్ణకుమారుడది అర్థము చేసికొన్నాడు. చెల్లెలి చెక్కిలి పుణికి ముద్దుగొన్నాడు. ప్రయణదేవతావశులకు పండితుల కర్థముకాని మాటలు మంచినీటి ప్రాయముగ పరిస్ఫుటము లగును.

***

హిమబిందుసౌధముపై నిలిచి, చిడిముడివడుచు సాయంతనమెప్పు డగునా యని వచ్చినచోటికే వచ్చుచు, పోయినచోటికే పోవుచున్నది. ఆమె వదనము ప్రఫుల్లమై రాబోవు సౌఖ్య మెదురుచూచుచున్నది.

కృష్ణవేణి యానాడు తన జడ నీటి పై తేలియాడుచుండ మందహాసంబున నిజముఖంబు కాంతులీన పవనకుమారునితో మేలమాడుచు, లేత మావిచిగుళ్ళు మెక్కుచు కోకిలపాడు పాటను వినుచు కృశాంగియై ప్రవహింపుచున్నది.


కోకిల:

కుహుకుహూ కుహుకుహు
కుహుకుహూ కుహుకుహు
కొసరుపాటల తేనె
పసరుమొగ్గల వగరు
ముసుగు గప్పిన నగవు
త్రస రేణువులపైన
అలరారే సంజవేళన్ (కుహు)





అడివి బాపిరాజు రచనలు - 2

• 107 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)