కలసి తిరిగివచ్చి నీ భక్తులైన శ్రమణకులకు ఎనిమిది విహారములు కట్టింతుము. బుద్ధదేవా! నీవేరక్ష” అని ప్రార్థించినది.
మహారాణి లేచినది. ఆమె వెనుక అమృతపాదులు, చంద్రస్వామి చేయి పట్టుకొని నిలిచియుండి “మహారాణీ! ఈతడు చంద్రస్వామి. ఉత్తమ బ్రాహ్మణుడు. నీ బిడ్డ నివిషయమంతయు నీకు అవగతము చేయును. ఈతని తమజైత్రయాత్రలోకూడ తీసికొని పొండు. చదువు కొనినవాడు. తన జ్ఞానముచే తమ కుపశమనము చేయును” అని తెల్పినాడు.
మహారాణి చంద్రస్వామికి నమస్కరించినది.
“దీర్ఘసుమంగళీ భవ, మహాసామ్రాజ్యప్రాప్తిరస్తు, నష్టపుత్ర పరిష్వంగప్రాప్తిరస్తు” అని ఆశీర్వదించినాడు. గణగణ స్థూపఘంటికలు మ్రోగినవి.
10. పేరంటము
చారుగుప్తుని భవనమున హిమబిందు తన అభ్యంతరమందిరములో వృషభములు, నెమిళ్ళు, మామిడిపిందెలు చెక్కిన సువర్ణఖచితపర్యంకముపై పరుండి కనుమూసుకొని సువర్ణశ్రీ కుమారుని భావించుకొన్నది. ఆ దినమున నాతడు తనకు మోకరిల్లినాడు. అత డెంత అందగాడు. ఆ మనోహరమూర్తి నిలువబడి యున్నప్పుడు ఆతనిమూర్తి ఎంతగంభీరమై, ఎంత తేజోవంతమై కనుపించినది. బోధిసత్యమూర్తివలె వెలిగిపోయినాడు. ఆతని మాటలు విన్నప్పుడు, రూపము తలచినప్పుడు తన కేల గుండె కొట్టుకొనును? ఏమి యాతని విశాలవక్షము.
సువర్ణశ్రీకుమారుడు వట్రువలు తిరిగిన బాహువులతో ఏనుగు కుంభమువంటి మూపుతో, ఉన్నత శరీరముతో, నూనూగు మీసములు సొబగులీను సుందరవదనముతో ఆమె మనోవీధుల మందహాసములతో మసలినాడు.
ఇంతలో నొకచేటిక వచ్చి “అమ్మా తేరు సిద్ధమైనది. పట్టణములోని కరుగుటకు చెలులు సిద్ధముగనున్నారు. వారు రా ననుజ్ఞా?” అని యడిగినది.
హిమబిందు శక్తిమతీదేవిగారిభవనమునకు పోయివచ్చిన నాలుగు రోజులైనవెనుక మరల నాగబంధునికను, సిద్ధార్థినికను కలుసుకొనవలయునని ఆమెకు గాఢవాంఛ కలిగినది. అందుకై యామె వసంతపూజ యని పేరుపెట్టి, నగరమున నున్న ఉత్తమ కుటుంబాలవారి బిలువ సంకల్పించినది.
చెలి చెప్పుమాట వినియు, అటు చూడక హిమబిందు పరధ్యానమున తలయూప నా చేటిక నమస్కరించి వెడలినది. ఇంతలో నలుగురు చెలు లామెకడకు వచ్చిరి. వారందరితో హిమబిందు పట్టణములోనికి పిలుపునకు బయలువడలెను.
తక్కిన పిలుపులన్నియు నెటుల నెరవేర్చుకొనినదో తిన్నగ స్యందనమును సాయంకాలము మూడవయామభేరీలు మ్రోగునప్పటికి హిమబిందుకుమారి తేరును శక్తిమతీదేవి భవనమునకు పట్టించినది.
అచ్చట వారికందరికిని కుంకుమసుమసమ్మిళిత మగు పసుపుబొట్టు నొసటనుంచి, సాయంకాలరోచిస్సు లపరదిశ వెలిగించునప్పటికి తన మందిరమున వసంతపూజ వాయనము లందుకొన పిలిచినది.
అడివి బాపిరాజు రచనలు - 2
• 104 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)