అమృత: యుద్ధము లవసరములేదు. అట్టి సత్యయుగము ముందు తప్పక వచ్చితీరును. మహారాజు నేడు జైత్రయాత్ర సాగించుట శత్రుమారణమునకు, రాజ్యసంపాదనకే గాదు. ధర్మరక్షకు, కుమారరక్షకు గూడ.
మహారాణి: నేను కఠినాత్మురాలను తండ్రీ! యీ నాలోని గట్టితనమునకు నేను వెగటుపడుచు నన్ను నేను గర్హించుకొనుచున్నాను. నా బంగారు తండ్రిని, నా పెన్నిధానమును నేను పోగొట్టుకొనియు మొండిజీవము ధరించియున్నాను. ఒకవంక బిడ్డకై భగ్నహృదయనయ్యు ఈయుద్ధ మహా మారణ కర్మమును కనులార గాంచనున్నాను. నన్నీ యవస్థలో డించిపోలేక సార్వభౌములు వెంట గొని పోవుచున్నారు.
మహారాణి కన్నుల నీరు బొటబొట కారినవి.
అమృత: అమ్మా! ఊరడిల్లుము. మనకందరకు ఏడుగడ బుద్ధదివ్య పాదార విందములు గాని మరేమి కలవు! చదువుకొన్న ఉత్తమ గృహిణి, విజ్ఞానవతివి. ఈ విశ్వమునం దేది శాశ్వతము? ఇది యంతయు నొక చిదాభాసము. ఈ అభాసమునే నిజ మని నమ్మెదవా? ఇది క్షణికము. నశ్వర మని యెరుగుటయే దుఃఖనాశనకారి. ఈ సంసారప్రవాహమున నీదులాడు జీవులకు నిత్యము యోగవియోగములు కలుగుచునే యుండును. ఎవరి కని దుఃఖింతుము, దేని కని సంతోషింతుము? ఈ సుఖదుః ఖములు రెండును బంధకారణములే. కావున నిర్మమత్వము నాశ్రయింపదగును. లోకమున అన్ని ప్రాణులవలెనే నేను, నా వారలు పుట్టి గిట్టుచుందురు. ఈ సంసారభావము నెరుగుటయే సంసారికి తరుణోపాయము తల్లీ!
మహారాణి: అవును మమత్వము తగ్గిన కొలది దుఃఖము తగ్గుచుండును కానిచో ఇంతమంది మృతికి కారణమగు నీ యుద్ధమునకెట్లు సమ్మతింతుము?
అమృత: మహాశ్రమణకబోధ అమృతజ్యోత్స్నకదా! ఆ వెన్నెల భరింపలేని వ్యతిరేకాత్ములు కొందరు బుద్ధధర్మమునే నాశనముచేయ సంకల్పించినారు. ఆ ప్రయత్నముల నరికట్టవలసిన విధి చక్రవర్తి పై నున్నది. ఆ యజ్ఞమునకే చక్రవర్తి యీ జైత్రయాత్ర సంకల్పించినారు. రాజధర్మమున కీ నిష్ఠురత తప్పదు. సమంతభద్రునిబోధ విషప్రాయముగ నెంచు ఆ హతభాగులెవ్వరో మీశిశువు నెత్తికొనిపోయినారు. ఈయుద్ధం వలన జననష్టముండదు. మీ హృదయమునకు అమృతశాంతి చేకూరు శుభదినము లరుదేరనున్నవి. శుభాసంశయే శుభప్రదము తల్లీ!
మహారాణి ఆ దివ్యజన్మునకు సాష్టాంగనమస్కారము చేసినది. చైత్యాభిముఖురాలై వెడలిపోయినది. మహారాణి తనతో కొనివచ్చిన వందలకొలది పండ్లతట్టలు ఆ మహాపరిషదాచార్యులకును, విద్యార్థులకును అర్పించెను.
మహారాణి యచ్చటనుండి విసవిస నడచిపోయి మహాచైత్యము చుట్టును మూడుసారులు ప్రదక్షిణముచేసి ఆయకస్తంభములయెదుట నామె సాష్టాంగ పడినది. “బుద్ధప్రభూ! అమృతహాసముల నీ ప్రజలందరిపైనను ప్రసరింపజేయుము. నీ దివ్య హాసములలోని త్రసరేణువు నా బాలకుడు. ఆతని రక్షింప నీవే దిక్కు. నా ముద్దు బాలకుడు నాకు దొరికిన మరునాడు ఈ మహాచైత్యమునకు లక్షదీపము లర్పింతును. ఈ యుద్ధమున అందరికిని భద్రత చేకూర్పుము. నా ఆత్మేశ్వరుడు నీకు పరమభక్తుడు. వారును నేనును
అడివి బాపిరాజు రచనలు - 2
• 103 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)