ఓం శుద్ధ చైతన్యమై జడమై సర్వము నిండియుండు పరమాత్మ యిచ్చచే జాగృతమై మహాసృష్ట్యున్ముఖమైనట్లు ఆ ప్రణవనాదము ప్రథమమున అపశ్రుతియై, అటువెనుక శ్రుతి స్వరూప మంది విజృంభించి, దివ్యరాగమై, అవరోహణమై ప్రసరించి ప్రసరించి గంభీరతలు పొంది మహాతేజ స్వరూపమైనది. లోకమున విస్తరించియున్న యా పురుషుని చైతన్యము విశ్వములోన ప్రతి అణువున ప్రతిధ్వనించి, ఆవర్తము లందుచు, సమీకృతమై, యింకను దగ్గరకుజేరి అతని దేహములో క్రమ్ముకొన్నది. అప్పుడాచిచ్ఛక్తి స్పందితమై ఆ దేహమున నణువణువున ప్రసరించినది. ఆ పురుషుడు కన్నులు తెరచి చూచినాడు.
ఒక భిక్షుడు: “స్వామీ, మీ రెవ్వరు?” అని ప్రశ్నించెను.
నూత్నపురుషుడు వారివంక నేమియు గ్రహింపనివానివిధమున తెల్లబోయి చూచెను.
భిక్షుడు స్వామీ, యీ మందు సేవింపుడు.
ఆ నూత్నపురుషుడు వలదని చేయి యూపెను. ఆతని బొమలు ముడివడెను. అప్పు డాతని ఆకారరేఖలు ఏదియో మరచిపోయినవాని విధమును సూచింపుచుండెను. ఆతనికి చైతన్యమువచ్చుటకుమున్నే వైద్యవిశారదుడైన భిక్కుడు కొన్ని ఓషధులు ఆ గాయము పైనుంచి శుభ్రవలిపమొండు కట్టుకట్టినాడు. ఆ నూత్న పురుషుడు చేతిచే తలకు కట్టినకట్టును తడవి చూచుకొని, యిది యేమని కన్నులతో ప్రశ్నించెను.
భిక్షుడు: “స్వామీ, మీకు నీరసముగా నున్నదా? అయినచో యీ రసాయనము సేవింపుడు” అని అనునయించెను.
నూత్నపురుషుడు ఏమియు లేదన్నట్లు తలయూపి, తానెవరని అడిగినట్లు కన్నులు విప్పి వారిని తీక్షణముగ చూచినాడు.
ఒక భిక్షుడు, “నీవు మాకు స్నానముచేయుచుండగ దొరికినావు. ఎక్కడనుండియో, కొట్టుకొనివచ్చుచుంటివని తెలిపినాడు. ఆ నూత్న పురుషుడు తన కేమియు నర్థమగుటలే దను భావమును స్ఫురింపజేయు విషాద యుతము లగు చూపుల ప్రసరింపజేసెను.
వృద్ధుడును, మహాతపః సంపన్నుడును అగు ఆ ఆశ్రమకులపతి ఆతని కానాటి నుండియు ఏమియు నెరుంగని చంటిబిడ్డకు నేర్పునట్లు జ్ఞాన ముపదేశింప నారంభించెను.
ఆ నూత్న పురుషుని పూర్వవాసన లెవ్వియో ఎవ రెరుంగగలరు? అవి మహోత్తమములై యుండవలయును. ఆరునెలలలో ఆతనికి విద్య లన్నియు వచ్చినవి. సర్వభాషలును వచ్చినవి. అయినను తా నెవ్వరో అతడెరుగడు.
స్నానము చేయునప్పుడు పాదములకు తగిలినకారణమున ఆ నూతన పురుషునకు అమృతపాదులు అని పేరిడినా రా ఆశ్రమవాసులు.
అమృతపాదులు మూడేండ్లయిన వెనుక భిక్కుధర్మమైన సన్యాస దీక్ష స్వీకరించెను. నీటినుండి పైకితీయబడినప్పుడే అతడు బ్రాహ్మణుడని మాత్రము వారు గ్రహించిరి.
సన్యాసమునందిన ఐదేండ్లలో అమృతపాదులు, అర్హతులైనారని కులపతి యాతని నాశీర్వదించి బుద్ధ సేవ చేయుమని ఆదేశమిచ్చి లోకములోనికి పంపించెను. అమృతపాదులు గురువును స్మరింపుచు, బుద్ధదేవుని ఆరాధింపుచు భూమండలమంతయు పరిభ్రమించి, పరివ్రాజకత్వము దాల్చిన నాల్గేండ్లకు ధాన్యకటక సంఘారామమున ప్రవేశించెను. జలమునం దాతడు దొరుకునప్పటికి అతనికి ముప్పది, ముప్పదిమూడు సంవత్సరము లుండునని యాతని గురువు ఊహించినారు. ధాన్యకటక సంఘారామ
అడివి బాపిరాజు రచనలు - 2
• 101 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)