పుట:Himabindu by Adivi Bapiraju.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీముఖు డామె అభిప్రాయముల నడుగు చుండును. సమయోచితముగ ఆమె తనభావము వెల్లడిచేయుచుండును.

ఆమె అతిలోకసుందరి కాకపోవచ్చును. కాని జవ్వనమున నామె ముఖములో దివ్యప్రసన్నత, స్పష్టరేఖారచిత నాసికాద్యవయవ సౌకుమార్యము శోభిల్లుచుండెను. మహారాణులకు, స్వర్గకాంతామణులకు తూచాలుదిద్దు సహజగాంభీర్య మామె సొమ్ము. సర్వాంగోపాంగస్వరమేళనముచే సుభగ మగు మంజులతాశ్రుతి ఆనాటియువతులలో నామెను సాటిలేని దానిని జేసెను. శ్రీముఖుడామెను గాఢముగా ప్రేమించినాడు. ఒండొరుల ప్రేమించి చేసికొన్న వారివివాహము స్వయంవరమే యనుకొని రందరును. ఆ నాటి ప్రేమ నేటివరకును ఇసుమంతయు తొణకక, తగ్గిపోక, స్నేహవాత్సల్యమిళితమై దినదినాభివృద్ధి గాంచుచు పెరిగినది.

సామంతులు, పరదేశప్రభువులు ఎందరో రూపగుణసంపన్నలగు తమ బాలల నిత్తుమని రాయబారము లంపిరిగాని శ్రీముఖుడు వలదని నిస్సంశయముగ దెలిపి నాటి మహారాజులలో ఏకపత్నీవ్రతుడని పేరందెను.

ఆనందదేవి కా దినముల హృదయమున కలత మరియు పెరిగినది. బాలకుని తస్కరించి పదునేనుమాసములైనది. ఆతనిజాడ లేదు. అప్పుడే వ్రాయనేర్చిన యాతని ముద్దుటక్కరములతో భూర్జపత్రలేఖలు మాత్రము నెలకొకటి వచ్చుచున్నవి. ఎక్కడనుండి వచ్చుచున్నవో, ఎవరు తెచ్చి దేవీపూజాపీఠమునం దుంచుచున్నారో ఎవరికిని తెలియుటలేదు.

ఉత్తరములరాకను గుర్తించుటకు నియుక్తులగు గూఢపురుషులు షండులు, చారిణులు ప్రయత్నించి ఒకదాసిని పట్టుకొనిరి. ఆమె కాయుత్తరము నిచ్చినయత డామెకు వలపుమగడు. ఆ విటునియింటి కెవ్వరోముసుగువైచికొని వచ్చి, ధనము ధారపోసి, ఆ యుత్తరము దేవీపూజా పీఠికపై నాలుగైదునాళ్ళలో నుంపగోరిరట. ప్రమాదములే దని వారిరువు రందుకు సమ్మతించిరట. వారిరువురిని రాజభటులు కళింగమునకు బంపి వేసినారు.

ఇంతలో అపసర్పులు కొందరు చాలసంగతులు సేకరించిరి. చాలవరకు కుట్ర తెలియవచ్చినది. అందులో స్పష్టరూపముతాల్చిన పురుషులు సోనుత్తరుడు, సంచరణుడు, మహేశ్వరానందుడు, చంద్రస్వామియు. వారిలోకెల్ల ధర్మశీలుడు చంద్రస్వామి అని అపసర్పాధికారి తెలిసికొని, మహామాత్యుల ఆజ్ఞపై చంద్రస్వామిని పట్టించి విచారణకు బెట్టెను. కానినిజ మింతయు దెలియలేదు. సోనుత్తరాదులు సంపూర్ణముగ మాయమై పోయినారు.

మహారాజ్ఞికి చక్రవర్తి ఎప్పటివార్తల నప్పుడే యందజేయుచుండెను. ఆ తల్లి ధైర్యమిసుమంతయు వీడకపోయినను విషాదముమాత్రమెట్లు పారద్రోల గలుగును? తుదిబిడ్డడు, అందాలపాపడు. పెద్దకుమారుని యందామెకు ప్రేమ తక్కువకాదు. కాని ఒరులసహాయమాపేక్షింపనిమేటి యని యామె కాతని శిశుదశనుండియు భావము. భీమునిగూర్చి కుంతి ఆరాటము పడినదా?

బాలకుడు మాయమైనాడను విషాదముతోపాటు ఆమెకు నెలలు గడచిన కొలదియు నీ యుద్ధము లెందుకు అని బాధ మొలకెత్తినది. ఎందుకు ఈ హింసలు, ఈ ప్రజానాశము?

అడివి బాపిరాజు రచనలు - 2

• 99 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)