దాసీలుగాని, చెలికత్తెలుగాని, అంగరక్షక వీరాంగనలుగాని ఆ చిన్నబాలకుని ప్రేమింపని వారు లేరు. అట్టియప్పుడు ఎవరి చేతులు ఆడెనో ఆ బాలుని తస్కరించుటకు? ఏమి కారణము? తన ముద్దుబిడ్డడు మొన్నమొన్నను పాలువిడిచిన పసికూన! ఎవ్వ డా కఠినాత్ముడు? ఎవ్వతె యా పాషాణహృదయ బిడ్డను తల్లియొడినుండి యెడబాపినది? ఆనందదేవి దుఃఖమునకు మేరలేదు.
ఆ మహాసామ్రాజ్యమునందున్న చారులు, రక్షకభటులు, ఉద్యోగులు, సేనాధికారులు, సాధారణప్రజలు మంజుశ్రీ రాజకుమారుని పోకడ తెలియుటకు ప్రయత్నించనివారు లేరు. జాలికుడు మహామంత్రము ప్రయోగించినట్లు మాయమై పోయినాడు. ఆ విశాలాంధ్రసామ్రాజ్యమునం దెచ్చటను యీషణ్మాత్రము జాడ దొరకలేదు. ప్రజలు తమలో దా మేవియో గుసగుసలుపోవుటే కానీ ఎవరికిని ఇదమిత్తమని యీగడ తెలియరాలేదు. చారశాఖాధ్యక్షుడగు శుకబాణుని ప్రజ్ఞ యించుకయు కొఱగాలేదు. ఇంతలో యుద్ధోపద్రవము వచ్చిపడినది.
హృదయాంతరముల నెట్టిబాధచే కుమిలిపోవుచుండెనో శ్రీముఖుడు మాత్రము నిండు రాజసభలోగాని, అవరోధజనమధ్యమునందుగాని తన ముద్దు బాలకుడు మాయమై పోయినాడను కించ యింతైనను వ్యక్తము కానీయలేదు. ఆ బాలకుడు మాయమైన సంవత్సరమునగూడ సార్వభౌముని జన్మదినోత్సవములు జరుగనే జరిగినవి.
సాధారణప్రజలోకమునకు మంజుశ్రీ మంత్రించినట్లు మాయమైనాడను వార్త తెలియనేలేదు. అది తెలియకుండునట్లు కట్టుదిట్టము చేయబడినది. ఒక భయంకర సంఘటన జరిగినప్పుడు దానికి ప్రతివారును కర్తలుగానే గోచరింతురు. ఎంత సన్నిహితులైనను వారిని గురించి అనుమానములు తక్కినవారి హృదయముల తలలెత్తు చుండును.
శ్రీకృష్ణశాతవాహనుడుగూడ నీ యనుమానములకు గురియయ్యెను. శ్రీకృష్ణునకు తెలియకుండగనే ప్రజ్ఞావంతులగు గూఢచారులు ఆతని సర్వవిధముల గని పెట్టి చూచుచుండిరి. కాని శ్రీకృష్ణునికిమాత్ర మేమి తెలియును?
కౌశికీపుత్ర శ్రీముఖశాతవాహనమహారాజు తన రెండవపుత్రుడు రాజకుమార శ్రీమంజుశ్రీ అంతవిచిత్రముగ రాణివాసమునుండి తిరస్కరిణీవిద్యచే తిరోధానమైనట్లు అగోచరు డగుటకు మొదట ఆశ్చర్యము నందెను. తర్వాత నాతడు గాఢవిషాదము పాలయ్యెను. అంత మహాక్రోధ మానసుండయ్యెను.
పుత్రునిగురించి ఎన్నివిధముల వెదకించినను ఆతడు బ్రతికియుండి విరోధుల హస్తముల నున్నవాడను సూచనలు తక్కవేరుజాడలేమియు కన్పింపవయ్యె. పామరులబోలి మహారాజులు ఎట్లు వాపోవగలరు? శ్రీముఖశాతశాహనుడు తనమహారాజ్యమంతయు అప్రమత్తుడై కనిపెట్టి యుండవలె. రాజ్యము చతుస్సముద్రవలయితయు చేయవలె. ధర్మము నాల్గుపాదముల నడపింపవలె. ఆంధ్రదేశమును, ఆర్యావర్తనమును సుభిక్షమై సకల సంపదాకరమై ధర్మపూర్ణమై, పుణ్యవంతమై స్వర్గధామములకు తుల్యము కావలెను. సర్వకాలమును శ్రీముఖునివాంఛ యది. ప్రజావ్యసనము ముందు, ఆత్మవ్యసనము తరువాత.
ఆనందదేవి భర్తకు తోడునీడయైన ఉత్తమ సహధర్మచారిణి, గృహిణి, మహారాజ్ఞి, ముఖ్యరాజసభయం దామె భర్తతోపాటు అర్ధసింహాసనమున నధివసించుచుండును.
అడివి బాపిరాజు రచనలు - 2
• 98 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)