పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

హేమలత

యాతని నాలింగనము జేసికొనెను. భీమసింగునాజ్ఞచే బాండురంగవిభుడప్పుడే కారాగృహమున కంపబడెను. అంతట వారు దర్బారును ముగింప దలచుచుండగా నటకు వేగిరపాటుతో జిదానందయోగి వచ్చి కొలువులో నున్న సమస్తరాజపుత్రవీరులను దాటి ఠాణాకు నెదురుగ జనెను. అతనిని జూచి రాణాయును భీమసింగును లేచి నమస్కరించి తమకృతజ్ఞతను దెలుపుమాటలేవో యనబోవుచుండగా వారిని వారించి చిదానందయోగి “ఓమహారాజా! ఓభీమసింగుమహారాజా! దురాత్ముడైనవసంత భట్టుపలుకులనమ్మి మీరు యుద్ధసన్నాహములు మానుకొనియున్నారు. అలాయుద్దీను దండయాత్ర వెడలి మనకు నిరువది క్రోసుల దూరమునకు వచ్చియున్నాడు. రెండుమూడు దినములలో మనపై నాకస్మికముగ బడుచున్నాడు; గాన నింక మీనిద్రలనుండి మేలుకొనుడు, అని యెలుగెత్తి పలికెను. భీమసింగు సాధారణముగ నట్టి యపశకునములందు దన్నెడబాయకుండు మనోధైర్యము జిక్కబట్టి యిట్లనియ. “చిదానందులవారిమాట నిక్కము; వారు సత్యమును దెలిసికొనినగాని మన కిట్లుచెప్పరు. అయినను మీరు భయపడక యిప్పటినుండి తగు ప్రయత్నముల జేయుడు. అనిన వెనుక యోగి రసపుత్రులారా! సూర్యచంద్రవంశజులగు మీరు మీరాజు నందును మీకుబూర్ణాబిమానమున్న బ్రాణముల కాశింపక బోరాడుడు. కులదేశాభిమానముల మాని దేవాలయముల నాశనముజేసి బ్రాహ్మణులనుజంపి గోవులనువధించు మహమ్మదీయులకు మీరు చిత్తూరుకోట నప్పగించ దలచిన పక్షమున నూరకుండుడు” అని ప్రోత్సాహ వాక్యములు పలికెను. రసపుత్రు లేక వాక్యముగ “మహారాజు నిమిత్తము దేశమునిమిత్తమును మా ప్రాణములను ధారవోసెదము. ఇదె యుద్ధసన్నద్ధుల మయ్యెదము.” అని యఱచిరి. లక్ష్మణసింగును భీమసింగును వారినభినందించి వీడ్కొలిపి యంతఃపురములకు బోయిరి.