పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

హేమలత

గడివైపునకు వెళ్లెను. కొని యంతకుముందే చినుకులారంభమై యెండచే గాగియున్న యోగి శరీరమును వడకునట్లు చేసి యాతని వస్త్రముల దడిపెను. బట్టతడుపుజల్లువాన కురియునప్పటికి మన బాటసారి దేవాలయపు ముంగిలి భాగమునకు నడచెను.

ఆ దేవాలయము మనము వ్రాయుచున్న యీకాలమునాటికి శిథిలావస్థ నొందినను బూర్వకాలము నందు గొన్ని దినము లున్నతదశ యందుండెను. క్రీస్తుశకము 1016వ సంవత్సరమునందు గజనీ మహమ్మదు హిందూదేశముపై దండెత్తి జగత్ప్రసిద్ధ పుణ్య క్షేత్రమగు మధురానగరమునఁ దద్దేవాలయమును దోచిఁకొని స్వామివిగ్రహమును స్వహస్తములతో బెకలించి దేవాలయమునెల్ల భూమితో మట్టము చేసెను. ఈ దేవాలయ మూరు బయటనుండుటచేత మ్లేచ్ఛ ప్రభువు స్వయముగా నాశనము చేయలేదుగాని తద్భటులు విగ్రహనాశన మొనర్చి యందు సైన్యమవ్వీటనున్నంత కాలమును దామువసించిరి. ఆనాట నుండియు నాకోవెల శిలావిగ్రహశూన్యమయ్యు నప్పుడప్పుడు డర్థ రాత్రముల యందు మనుష్యవిగ్రహములతో గూడియుండుటగలదు. దూరదేశ ప్రయాణములను జేయుచున్న బాటసారులను, ద్రవ్వపంతులను వణిజులను దోచిఁకొని స్త్రీలను జెఱఁబట్టి స్వచ్ఛందవిహారము సేయు దుర్నీతిపరులగు చోరులకును దురాచారులకును నాదేవళము శరణ్యంబై యుండెను. అందుచేత దీపములు పెట్టిన తరువాత మధురానగర వాస్తవ్యులెవ్వరు నా దేవాలయ ప్రాంతముల రుగరు. అరిగిన నపాయము లేకరారు. ఒకనాడు శవదహనమైన గుర్తులు కనఁబడుట వలనను, నింకొకనాడు మనుష్యులు ధరించు కొన్ని వస్త్రములును గన్పడుటవలనను జను లాప్రాంతమునకు బొత్తుగా వచ్చుట మానిరి. ఈ ప్రదేశమునకు నలుదెసలను దట్టముగనున్న వృక్షములు