పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

హేమలత

చిదా — మనము వెళ్ళినదాకా వారక్కడనుండి యడుగైనను గదలరు త్వరగా రండు.

జ్ఞానా — మనమందరము మిగుల నదృష్టవంతులము. మనకుఁ జక్రవర్తి దగ్గరనుండి మంచి బహుమానములు దొరకగలవు. మన మొక్క పని జేయవలయును. అది మీరతిరహస్యముగ నుంచవలయును. ఈబాలుడు మనవాడేకదా?

చిదా — ఈ కుఱ్ఱవాడు మనవాడే. మీరు సందేహింపక స్వేచ్ఛగా మటాడవచ్చును.

జ్ఞానా — “సరే సరే! దగ్గఱగారమ్ము నాయనా” (అని త్రోవలో నిలిచి మెల్లగా) ఈ చిత్తూరు నగరమునకు సంరక్షకుడై రాజున కాంతరంగికుడగు మదనసింగను రసపుత్రవీరుడు కలడట. అతడు మహాపరాక్రమ వంతుడట. అతడుండగ మనకి చిత్తూరు రాజ్యము లోబడదుగనుక మన మెట్లయిన నతని నీ రాత్రి పట్టుకొని వధింపవలయును. ఈ వేళ నతడు చిక్కకున్న పక్షమున మన మీపురమున నాల్గుదినములైన నిలచి యాతని నంతము నొందించవలయును. ఈ కార్యముజేయకున్న మనకు మాట దక్కదు. నీయభిప్రాయమేమి?” అని బ్రాహ్మణ వేషధారియగు మదనసింగు నడిగెను. మదనసిం గామాటలువిని జ్ఞానానందులవారికి దనపైగల మహాకోపమున కాశ్చర్యమొంది చేతికర్రలో నమర్పబడిన కత్తిపిడిపై జేయివైచి యుత్తరుఫు నిమిత్తము చిదానందయోగి మొగమువైపు జూచుచుండెను. చిదానందయోగి కొన్ని సంజ్ఞలచే మదనసింగు ప్రయత్నమును మాన్పి యింకను వానిదగ్గరనుండి కొన్ని మాటలు వినగోరి స్వాములవారి కిట్లు ప్రత్యుత్తరమిచ్చెను.