పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

87

చక్రవర్తివలన మనకగు గౌరవమును నేను వర్ణింపజాలను” అని ప్రయత్నజనితమగు నానందమును బట్టజాలక తత్సూచకములగు మాటలాడి “ఆతఁడెక్కడున్నాడు?” అని యడిగెను. మిమ్మీక్షణమే వెంటబెట్టుకొని రమ్మని మాకు సెలవిచ్చినాడు. జోడుగుఱ్ఱముల బండిపై బాలునెక్కించి బంధించినాము. మీరు వచ్చిన వెంటనే ప్రయాణమైపోవచ్చును. చక్రవర్తి వసంతున కిమ్మని తమచేతికిచ్చిన యుత్తరముల గూఁడ దేవలయునని మీతో మనవి చేయమనెను” అని చిదానందయోగి చెప్పెను.

ఆ మాటలువిని పాండురంగనాధుఁ డాశ్చర్యమొంది వారు వసంతుని యాంతరంగికులని నమ్మెను. మదనసింగును చిదానందయోగి జ్ఞానానందుల వారిని ద్వర పెట్టి “మన నిమిత్తము వారు మామిడితోటలో గనిపెట్టుకుని యుందురు. ఇఁక బ్రొద్దెంతోలేదు. తమ రాలస్యముజేసిన దెల్లవారునప్పటికి బది క్రోసుల దూరమైన సాగిపోలేము.” అని హెచ్చరింప జ్ఞానానందులవారు తన పాతాళమందిరమున కరిగి చెంబులోఁ బెట్టి బూడ్చిన యుత్తరముల గ్రహించి మనశూర శిఖామణు లిరువురు దనవారని భ్రమపడి ప్రయాణ మయ్యెను. అట్లు బౌద్ధ మఠమునుబాసి వారు మువ్వురును గలసి దూర్పుదిక్కున కభిముఖులై నడువసాగిరి. జ్ఞానానందులవారు చిత్తూరు నగరము యొక్క మాఱుమూల సందుల నెఱుకరుగాన జిదానందయోగి యాతనిని మార్గముదప్పించి క్రొత్త సందులనుండి తీసికొనిపోవుచున్నను నాతడది గ్రహింపలేకపోయెను. కొంతదూరము వచ్చిన తరువాత వారికి క్రింది సంభాషణము జరిగెను.

జ్ఞానా — వారీపాటికి మునుపటిచోటనుండి వెడలిపోరుగదా?