పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హేమలత

7

శయనించెను. అప్పుడు యమునాజలబిందువులతోఁ గూడ మలయమారుత మరుదెంచి యాప్తమిత్రుఁడువచ్చి మీఁదఁ జేయివైచి తట్టినట్టు గడుమార్గాయాసము నొందియున్న యాతని శరీరమును స్పృశించి యాయాసము నపన యించెను. ఆతఁడును సకలజన సులభమైన యీదైవదత్త సౌఖ్యము చేత పరవశత్వమునొంది కనులు మూసికొని హాయి హాయి యని కొన్ని నిమిషముల వఱకును దనకష్టములనెల్ల మఱచిపోయెను. ఆసమయమునం దాకాశమున వసంతకోటి నక్షత్రములు మినుకుమినుకు మని జ్యోతులవలెఁ బ్రకాశించుచుండెను. అదినిర్జనస్థల మగుటచే నిలకోఁడి, చిమ్మట, మొదలగు జంతువుల రొదతప్ప మఱియొ ధ్వని యేదియు లేదు. నిశ్శబ్దముగనున్న యాస్థలమునందు శయనించినతోడనే యతనికిఁ దన పూర్వవృత్తాంతము జ్ఞప్తికివచ్చి వానిని విచారమునందు ముంచెను. వెంటనే యతండు “హా దైవమా! ఎంతకష్టము గలుగఁజేసితివి, ఆహా! ఏమీ తురకల దౌర్జన్యము. ఈ మహమ్మదీయ ప్రభుత్వ మెన్నఁడై న నశించునా” యని తనలో దాననుచుకొనుచు వశముగాక వచ్చిన బాష్పజలమును దుడుచుకొని యాకాశమువంకఁ జూచునప్పటికిఁ జిన్నమబ్బు కనఁబడెను, అది క్రమ క్రమముగా గొప్పదై యాకసమునంతను నాక్రమించుకొనుటచేతను, దానితో గాలిదుమారము వచ్చుటచేతను వర్షమువచ్చునని యోజించి యిసుక తిన్నె మీద బవ్వళించిన యోగి యెచట తలదాచుకొందునోయని చింతింప నారంభించెను. కొంచెమాలోచించు కొనునప్పటికి దాను బగలుదాగికొన్న మామిడి తోపునకును నదికిని మధ్యనున్న పాడుదేవాలయ మాతనికి జ్ఞప్తికిరాగా నటకుఁ బోవ బ్రయాణమయ్యెను. ఆ దేవాలయమునకును నదీతీరమునకు గొన్ని గజముల దూరముమాత్రమే యుండుటచేత నీమనుష్యుడు త్వరితముగా నడిచి