పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యోగి వాని కుడి చెయ్యిపట్టుకొని కుమారా! నా వృత్తాంతమును బూర్ణముగ నీ కెరిగింపరాదు. అయినను నీ సందేహ నివారణార్థము నేనొక సంగతి జెప్పెదను. చిత్తూరు రాజ్యసంరక్షణమునకై నేను నాశక్తి ని ధారవోయుచున్నాను. దేశముయొక్క నానాభాగములకు మాఱు వేషముతో మనుష్యలనంపి యాయావృత్తాంతము లెఱుంగుచున్నాను. నేను గూడ శౌర్యవంశమైన వంశస్థుడనే కాని కారణాంతరమున నీ యాశ్రమంబును స్వీకరించితిని. నేను జెప్పునట్లు నీవీ రాత్రి నడచికొనిన నాప్రాణమునైన గోల్పడి నీకాపద రాకుండ జేసెదను అని చెప్ప మదనసింగాశ్చర్యపడి మీరు రసపుత్రులా! అట్లయిన నేను దమ యాజ్ఞ ప్రకార మీరాత్రి నిస్సందేహముగ నొనర్చెద ననెను. ఈ వఱకే రాత్రి పొద్దుపోయినది. ఇక మన పనిమీద మన మరుగుదము. రమ్ము, అని యోగి లేచెను. మదనసింగును లేచి యాతని వెంబడింప నిరవురును నడువ నారంభించిరి. అప్పుడుసరిగ రెండుజాముల రాత్రి యగుటచే నమ్మహానగర వాస్తవ్యులందరు నిర్భయముగ నిద్రపోవుచుండిరి. వీధులన్నియు నిర్మానుష్యములై యుండెను. ఉత్తమకులస్థులెన్నడు బ్రవేశింప గూడని పేటలను సందులను గొందులను వారు తిరుగుచుండిరి. అప్పుడు మదనసింగు “ఆహాహా! ఈవీధుల యందర్థ రాత్రముల నరహత్యలు జరిగినను దిక్కులేదు గదా. ఒంటరిగ నీ సందుల నరుగువాడు నిరపాయముగ జనడు” అని తనలో ననుకొనుచు గమ్యస్థాన మెదురు చూచుచు జిదానందయోగితో గూడ నరుగు చుండెను.