పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

75

సదా – ఆ సంగతి జెప్ప మఱచినాను రాముడు గంజాయి మత్తుచే రహస్యము వెడలగ్రక్కినాడు. ఈ దినమున జరుగదలచి నదియు మనము విన్నదియు నిజమే.

చిదా – నీవింక పొమ్ము. ఓరీ గంగా! రా రా నీవార్తలేమి?

గంగా – మహరాష్ట్రరాజులు మాలికాఫరుచే నోడింపబడిరి. ఆ దేశము గూర్చిమన మిక నాశ పడగూడదని మనబావాజీలు చెప్పినారు. గోకులమఠమున గోసాయి లిచ్చిన యుత్తరము లివిగో! (అని యుత్తరములిచ్చెను)

ఆ యుత్తరముల గ్రహించి చిదానందయోగి వారినందఱ నంపి తనయెదుట గుండమున వెలుగుచున్న యగ్నిహోత్రపు కాంతి నాలేఖల జదువుకొని యేదో యోజించుచుండెను. అప్పుడు మదనసింగు జయ్ క్షీరసాగరశయన, యని యఱచెను. చిదానంద యోగి త్వరితగతి లేచి మదనసింగును వెంటబెట్టుకొని లోపలికి వచ్చి తలుపు గడియ వైచెను. కృష్ణసింగు వీధిలో మఱ్ఱి చెట్టుక్రింద పైబట్ట పరచుకొని నిద్రపోవనారంభించెను. చిదానందయోగి వేషభాషాదుల జూచి మదసిం గాశ్చర్యమునొంచి కొంతసేపటికి స్వామీ మనమేమి చేయవలయును దాదాపుగ రెండు జాముల రాత్రియైనది యనెను. యోగి తద్వచనము యోజించి మదనసింగును దగ్గఱగ రమ్మని యిట్లనియె, “బాబా! నీవాయుధముతో సిద్ధమైవచ్చినావా? ఏదీ కత్తి యెక్కడ” అన మదనసింగు, నే నెవరినైన వధింపవలెనా యేమి? ఎవరిని? ఈ వేషమున నున్న మీరెవ్వరో నాకెఱిగింపుడు. ఈ విషయమున నన్ను సంతుష్టునిగఁ జేసిరేని మీ సెలవునకు బద్ధుడను అని రాకొమారుడను పలుక