పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

హేమలత

రాకను దెలియజేయ దాంబూలము నమలుచు వేశ్యాంగనా గృహముల నలంకరింపబోవు రసికశిఖామణులు మాత్రము కొందఱందందు వారి కగపడుచు వచ్చిరి. అక్కడక్కడ రెండుమూడు మిఠాయి దుకాణములును వొకటి రెండు తమలపాకుల దుకాణములును దక్క దక్కిన బజాఱులెల్ల మూయబడియుండెను. మెల్లమెల్లగ నడచి రాజవీధినిదాటి ప్రక్కసందులోనుండి కొంతదూరముపోయి మదనసింగు తనకు యోగిచెప్పిన గుర్తులను బట్టి యావీధి నున్న చిన్న మఠముజేరి కృష్ణసింగును వీధిలో నుండనియమించి తాను లోనికిబోయెను. అతడు మఠము బ్రవేశించునప్పటికి జిదానంద యోగి యెవరితోనో రహస్యములు మాటలాడుచుండుటంబట్టి మదనసింగు వెంటనే యోగిదగ్గఱ కరుగక యొక యరుగుమీద గూర్చుండి వారి సంభాషణము వినుచుండెను.

చిదా – ఏమిరా! దామోదరా ! ఢిల్లీ వార్తలేమి?

దామో – స్వామీ! చక్రవర్తి దండయాత్రమాట నిజము. ప్రయాణసన్నాహము జరుగుచున్నది. మురళీధరదాసు మఠములో మనవాండ్రందరు నెప్పటి వర్తమానములప్పుడు తెలిసికొనుచున్నారు.

చిదా – అట్లయిన నీవుపో! (అని వాని నంపి) ఓరీ సదాశివా! ఇటురా.

సదా – మహాప్రభూ! ఆపిల్ల మీరు జెప్పినచోట సుఖముగనున్నది. నేను జూచి మాటలాడి వచ్చినాను. ముసలివాడందే యున్నాడు.

చిదా – గంజాయి దుకాణమునకు వెళ్ళినావా? అందలి విశేషములేమి?