పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

హేమలత

ష్టము కలిగెను. కాని తన యేలిక వానినాదరించుటచే దానును గౌరవముతో నాతనిఁ జూచుచుండెను. అందఱును సంభాషణ చాలించిన తరువాత లక్ష్మణసింగు మహారాష్ట్రునిజూచి “అల్లాయుద్దీను మాదేశముపై దండెత్తునా” యని యడిగెను. వసంతభట్టు కొంచెము యోజించి ‘స్వామీ! తమ దేశముపై జక్రవర్తి దండువెడలడు. అతనికి రాజపుత్రుల పోరువిన్న గడుభయము’ అని పలికిన వసంతభట్టు మాటలను మహారాజును లక్ష్మణసింగును విశ్వసించిరి. మదనసింగు వారివలెదృఢ విశ్వాసముంచలేదు. ఆ సంభాషణము ముగిసిన పిమ్మట భీమసింగు మదనసింగు ప్రముఖులకు సెలవునొసంగెను. ఆనాడు మొదలు కుమారుడయిన లక్ష్మణసింగుమహారాజునకు వసంతభట్టు ప్రాణమిత్రుఁ డయ్యెను. భీమసింగునకు నత డాంతరంగికుడై యుండి సర్వకాలములయందు నాలోచనము జెప్పుచుబ్రభుసమ్మానముచే జనులకును గౌరవాస్పదుడై యుండెను. అదియిట్లుండ మదనసింగు త్రికాలవేది యగు చిదానందయోగి మఠమున కనేకపర్యాయము లరిగి వేదాంతవిషయములను రాజకీయవ్యవహారములను ముచ్చటించుచు నుండుటచే యోగికిని మదనసింగు నకును స్నేహమయ్యెను. అందుచేత మహారాజునకు గూడ యోగిని రెండుసారు లాతడు చూసి వారి కాతని యందు గౌరవము కుదురునట్లు చేసెను. యోగి రాజపుత్రులయందత్యంతాభిమానమును మహమ్మదీయుల యందసూయ మెండుగజూపుచు, మదనసింగునకును, రాణాకునుఢిల్లీ విషయ వర్తమానముల నెట్లో తెప్పించి యనుదినమును దెలియ జేయుచువచ్చెను. అందుచేత యోగితో బలుమారు రాజులర్ధరాత్రముల రహస్యముల మాటాడుచు వచ్చిరి. ఇట్లు నాలుగుమాసములు గడచెను.