పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

ఇట్లు మదనసింగు చెప్పినతోడనే కొంచెమాలోచించి చిదానందయోగి పైకిఁజూచి స్పటికాక్షసూత్రమును ద్రిప్పి సంచిలోనుండి యొకతాఁటియాకు గ్రంథమును దీసి యొక చిన్నపుల్లతో మూఁడుమాఱు లాపుస్తకముపయ్యి గొట్టి గ్రంథమును విప్పి యేదియో చూచి యోగి యిట్లనియె బాబా! నీవడిగినప్రశ్న రామదేవు నను గ్రహముచే నాకుఁ బూర్ణముగఁ దెలిసినది. నీ వడిగినవారిలో ముసలివాఁడొకఁడున్నాఁడు. పదునాఱేండ్లకన్య యొకతెయుఁగలదు. వారిద్దఱు ఆపదలో నున్నారు. ఆమె యతనివద్దలేదు. పరదేశమందున్నది. వారి కింతలోఁగష్టము తొలగునట్లు తోఁచదు. అనిచెప్ప మదనసింగునకు ముఖవికాసముతగ్గెను. తరువాత యోగివద్ద సెలవుగైకొని యాతడింటికరిగి యాదిన మన్నము ముట్టక విచారగ్రస్తుఁడై యుండెను. రాత్రి జామైనతరువాత మదనసింగు మంచముపై శయనించి యుండఁ గృష్ణసింగు వచ్చి యాతనితో “అయ్యా” మహారాజుగారు తమ్మొకసారి రమ్మని వర్తమానము పంపినారు. వీధిలో వారిసేవకుఁడున్నాడు” అని నమ్రతతో విన్నవించుటయు వెంటనే మదనసింగు తల్లిదండ్రులకావార్తజెప్పి రాజసమ్ముఖమునకరుగుటకుఁ దగు వస్త్రాలంకారముల ధరించి యశ్వారోహణముజేసి తిన్నగఁగోటకుఁజని, రాజపుత్రభటులుకావలియున్న యనేక ద్వారములు గడిచి మోతీమహల్ ప్రవేశించి గుఱ్ఱముదిగి మహారాజు కూర్చుండియున్న గదిలోనికి బోయిఁతనయేలికయెదుట నిలుచుండెను. భీమసింగతనిజూచి ‘కుమారా! ఇచ్చటఁగూర్చుండు’ మని చెప్పి పీఠమునుజూపెను. ఆగదిలోనొక యున్నతాసనమున భీమసింగు గూర్చుండియుండగా లక్ష్మణసింగును బ్రక్కను గూర్చుండి పినతండ్రివైపు జూచుచుండెను. వారికట్టెదుట నెఱ్ఱని వస్త్రములు గట్టుకొని నిలువఁబడియున్న యొకపురుషుని