పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యొకదినమున మహారా జొంటిగ నున్నప్పుడు పాలిగ్రామమున సకల కష్టములతో గాలముబుచ్చుచున్న వృద్ధుని వాని మనుమరాలిని రాజస్థానమునకు బిలిపింపవలయునని చెప్పి యనేక విధముల బ్రార్థించెను. దయాళుడగు భీమసింగు వారల దైన్యమును విని విచారించి చక్రవర్తికిని దమకును జరుగుచున్న సందేశములు మగిసిన తరువాత గొన్నినాళ్ళకు వానిని రావింప నగునని చెప్పి మదనసింగును సంతోష పెట్టెను. మదన సింగునకు హేమలతయం దను రాగము నానాటికి దృఢ మగుచుండ నామె యెంతదూరము నున్నను సింగుహృదయమామెసమీపముననే యుండెను. ఇట్లు మదనసింగు మదనాగ్నిచే వేగుచు నాగతానాగతవేది యని ప్రసిద్ధి కెక్కిన చిదానందయోగిదర్శనము జేయగోరి యొకనాడత డున్న రామదేవునిమఠమున కరిగి యోగి దర్శించి నమస్కారము జేసి యతడు గసుసన్నజేయ యొకచోట గూర్చుండి యితడింత నిండు జవ్వనమందే యోగాశ్రమస్వీకార మేలచేసెనోయని యోజించుచుండెను. చిదానంద యోగి సాక్షాచ్ఛివావతార మని జనులు చెప్పుకొనట కలదు. మదనసింగు ముఖ విలాసము జూచి యాతడేదోపని మీద వచ్చినా డని తెలిసికొని యోగి “బాబా! ఏమి నీ విటు వచ్చినావు? అని యడిగెను.

మద – స్వామీ! మీదర్శనమునకే వచ్చినాను.

చిదా – నీవేదో యడుగవలెనని వచ్చినట్లున్నావు అడుగవచ్చును.

మద – అయ్యా! దూరదేశమున నాకాప్తులున్నారు. వారుసుఖులై యున్నారా?

చిదా – వారు తురకలా? హిందువులా? ఏజాతివారు?

మద – హిందువులు మారాజపుత్రులు.