పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

హేమలత

సంతోషమునబొంగి మదనసింగును స్తోత్రముజేసిరి. మదనసింగింటికి వచ్చినతోడనే తనపినతల్లియగు సువర్ణబాయికి నమస్కరించి యామె యాశీర్వచనముల నంది యనేకాంశములగూర్చి యామెతో ముచ్చటించెను. మాటలాడునపుడు పరధ్యానముచేత దడబడుచుండుటయు నారాత్రినిద్రలేక నటు నిటు విహరించుటయు సువర్ణబాయిచూచి యతడు మోహపరవసుడై యుండెనని కనిపెట్టెను. మరునా డుదయమున మదనసింగుతో గూడ బ్రయాణము జేసినకృష్ణసిం గనుసేవకుని దత్కారణమడుగ నాతడు హేమలత సమాచారమును నామె యందాతని చిత్తము దగులుటయు సమగ్రముగా విన్నవించెను. సువర్ణబాయి యుత్తమ కులేస్థురాలగుటచే హేమలతవంటి బీదకన్యను దనకుమారునకు భార్యగా గ్రహించుట కిష్టపడక తనభర్తయగు ప్రతాపసింగున కావార్తనెరిగించి యతడు దనతో నేకీభవించునట్లు జేసెను. మదనసింగు రెండు సంవత్సరముల ప్రాయము గలవాడైనపుడు తండ్రి మాధవసింగు మహాయుద్ధమున మృతుడయ్యెను. మృతినొందిన భర్తకళేబరముతో నాతనిభార్యయు మదనసింగుతల్లియు నగు మోహిని యప్పటి వాడుక ప్రకారము సహగమనము చేసెను. సువర్ణబాయికి బిడ్డలులేరు గనుక బావకుమారుడగు మదనసింగును బెంచుకొని యామె కడుగారామున జూచుకొనుచుండెను. ప్రతాపసింగునకు మాధవసింగు దమ్ముడగుటచే నాతనిసేనానాయకత్వ మితనికిచ్చి చిత్తూరు ప్రభువులీతనిని గౌరవించిరి. ఆనాటనుండియు సువర్ణమతని తల్లిగను బ్రతాపసింగును దండ్రిగను నెంచికొని మదనసింగు తల్లిదండ్రుల మఱచి సుగుణసంపత్తిగలవాఁడై తండ్రికిని గుటుంబమునకును గీర్తిదెచ్చుచుండెను. మదనసింగు చిత్తూరు ప్రవేశించి హేమలతా నారాయణసింగులను మరువక