పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

65

లక్ష్మణసిం గనునొక బాలుడు చిన్నతనముననే యాతని తండ్రి పరలోకగతు డగుటచే నాతని పినతండ్రియు శూరశిఖామణియు సింహపరాక్రముడనగు భీమసింగుమహారాజు లక్ష్మణసింగునకు సంరక్షుడయి రాజ్యపరిపాలన మొనర్చుచుండెను. అతనికి రణరంగమున నెంత సాహసమో న్యాయపరిపాలనమునం దంత శాంతమునుండెను. లక్ష్మణ సింగుప్పటికి బదునాలుగేండ్ల ప్రాయము గల కుమారుడైనను శౌర్య సద్గుణములచే మిగుల వృద్ధుడైయుండెను. రాజాస్థానముపై ఢిల్లీచక్రవర్తి యగు నలాయుద్దీను దండెత్తునని భీమసింగు విని చక్రవర్తి సమ్మతమునకు మదనసింగును రాయబారిగ నంపెను. చిత్తూరు సేనా నాయకుడగు ప్రతాపసింగునకు మదనసింగన్న కుమారుడు. అతడు బాలుడయ్యుదృత రాజభక్తియుక్తుడు విమలగుణ సంపన్నుడు నగుటచే మహారాజున కాంతరంగికుడై రాజకీయవ్యవహారములయందు గొంతభారము వహించి పాటుపడుచుండెను. అందుచేత నాతడు చక్రవర్తికడకు పంపబడి సాలిగ్రామము విడుచునంత వఱకును జరిగిన వృత్తాంతమును మీరందఱెరు గుదురు. చిత్తూరు నుండి రాయబారిగ నేగిన మదన సింగు దర్బారునందు గడుచమత్కారముగ సంచరించుచుండుటచే జక్రవర్తి యాతని నెక్కుడు గౌరవముతో నాదరించెను కాని కార్యములయం దాతనితో గపటము విడిచి మాటలాడలేదు. చిత్తూరుపై దండయాత్రజరుపుటకు దనకిష్టము లేదనియు రాజపుత్రులతో నత్యంతమైత్రినుండుట దన మనోరథ మనియు జక్రవర్తి యాతనితో బలికి యతనిని సబహుమానముగ దేశమున కంపెను. మదనసింగు చిత్తూరునకు వచ్చిననాడె తనసందేశార్థమును భీమసింగు మహారాజునకు నిశ్శేషముగ దెల్పెను. అంతట మహారాజును దక్కిన యుద్యోగస్థులును