పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

55

వహించినట్లున్నది. ఆ మదనసింగునకును యోగికిని బరమమైత్రి కలదు. అయ్యోగి యెవరో నిలుకడమీద దెలియవలయును. అనవుడు జక్రవర్తి యాగ్రహము పట్టజాలక తత్క్షణమే యా దుర్మార్గుని బట్టి యేల చెఱలో వేయలేదు? నీవు సమయోచితబుద్ధి లేనివాడవు. అని తిట్టుచుండగా రహిమానిట్లు చెప్పుచుండెను.

“మదనసింగును నఱకవలెననియే నేను దోషముతో ఖడ్గమునెత్తి యాపాపాత్మునిపయి బడితిని గాని నాజరుజంగు నన్ను బట్టుకొని యాపెను.” అనవుడు మండిపడి పీఠమునుండిలేచి చక్రవర్తి నాజరుజంగడ్డు వచ్చెనుగా? అతఁడును వానితో గలిసెనా? యని యడిగెను. అంత ఖాను మెల్లన నిట్లనియె “దేవరవారు నన్ను క్షమించిన పక్షమున నా సంగతి మనవిచేసుకొందును. మదనసింగునకు నాజరుజం గాప్తమిత్రుడు. అత డీ కుట్రలో జేరకున్నయెడ, విదేశీయులు విమతస్థులగువారి కీ స్నేహమెట్లు కుదురును? దానికి నిదర్శనముగనిప్పుడు చదివిన యుత్తరములో గొందఱురాజపుత్రులతోను మహారాష్ట్రులతోను జేరుదురనియు నుండలేదా? నాజరుజంగు మొదలగు వారుండుటచేతనే యీ యుత్తరమున నట్లున్నది.” అని చక్రవర్తికి సలాముచేసి ఖాను కూర్చుండెను.

తరువాత జక్రవర్తి వజీరును వసంతభట్టునుజూచి నాజరుజంగు విషయమున మీ యభిప్రాయమేమి? అని పలుక వజీరిట్లనియె “ఆ విషయమున నాతఁడెట్లు చెప్పుకొనునో విని కర్తవ్యమూహించుట శ్రేయము” అనుచుండగా పాదుషా దీని కతనిమాట వినుట యెందుకు? లిఖిత నిదర్శనముండగా నిందబద్ధమేమున్నది అనెను. తాను ద్రవ్విన గోతిలో మదనసిం