పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

హేమలత

మహమ్మదీయుడ వగుట నీ పాపములు క్షమింపఁబడినవి. కాఫరు లందఱు నీచేత హతులగుదురు. నీకు శుభమగు బొమ్ము అని తాను సాగిపోయెను.

ఖానును మహానందముతోఁ దనబస కరిగెను. ఆలోపున జక్రవర్తి ఖానురాక కెదురుచూచుచు, నిర్హేతుకమైన యాలస్యమునకు వాటిని నిందించుచు సమీపమున నున్న బానిసలపై మండిపడుచుఁ గొంతసేపటికి ముఖ్యమంత్రియైన జహందరులోడికి వర్తమానమంపెను. అతఁడును వచ్చి చక్రవర్తికి సలాము చేసి చేతులు జోడించుకొని యెదుట నిలువ జక్రవర్తి కూర్చుండుమని కనుసన్నఁజేయ నొక పీఠముపై గూరుచుండెను. అంతటఁ జక్రవర్తి వజీరును జూచి రహిమానుఖాను కొన్ని రహస్యములగు కాగితముల దెచ్చినాఁడట! వాని మనము పరిక్షింపపలెను. అని చెప్పగా వజీరు ఖాను నిమిత్త మెదురుచూచుచు నుండెను. అంతలో రహిమానుఖాను కాగితముల కట్ట చేతఁబట్టుకొని మెల్లమెల్లగా, మేడమెట్ల నెక్కి మూడవ యంతస్తు మీదకు వచ్చి చక్రవర్తియు వజీరును నున్న మందిరముఁ బ్రవేశించి వినయ పూర్వక వందనముల సల్పి యెదుట నిలిచెను. చక్రవర్తి వాని నుచితాసనమున గూర్చుండ నియమించి యతని చేతనున్న కాగితములకట్ట నందికొని విప్పిచూడ నందు నాలుగైదు కాగితములుండెను. ఆ కాగితములు మహారాష్ట్ర భాషలో నుండుటవలన, నా భాషయం దెవరికి దెలియకుండుటను వారందలు యోజించి రాజభక్తిగలిగి మాయోపాయములం దాఱితేఱిన వసంతభట్టను మహారాష్ట్ర బ్రాహ్మణునకు వర్తమానము నంపిరి.

ఆతఁడును నర్ధరాత్రి వచ్చిన వర్తమానమునకు భయపడుచు, జపల చిత్తుడైన పాదుషావలన నేమి కీడుమూడునోయని, యీ గండము గడిచిన యెడల భవానికిఁ గుంకుమపూజ జేసెదనని మ్రొక్కుకొని యచ్చటికివచ్చెను.