పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

51

ఫకీరు – నేను కులందర ఫకీరునే. అయ్యా! నా సంగతి నీకెందులకు?

ఖాను – అయ్యా! తమరు మహాత్ములు, పైగంబరులవంటివారు. నాకు నేఁ డొక్క యాపద సంభవించినది. అది యెట్లగునో మీరు తెలుప వలెను.

ఫకీరు – (మాటవిని కొంచె మాలోచించి) హా! మహమ్మదు! మౌలా అల్లీ! నామీద దయగలిగియుండుడు. అయ్యా! నాడు దెలిసినంత వలకు నీ యవస్థను దెలిపెదను. అది నిజమగునేని నీవు నూఱగురు ఫకీరులకు నన్నము పెట్టగలవా?

ఖాను – సందేహమేమి? మీ సెలవు ప్రకారము జేసెదను.

ఫకీరు – అయ్యా! నీ పేరు రహిమానుఖాను కాదా?

ఖాను - (ఆశ్చర్యముతో) చిత్తము.

ఫకీరు – నీపైని దుర్మార్గులు చక్రవర్తితో నేరములఁజెప్పిరి కాని మహమ్మదు వారి దయవలన నీదగ్గఱనున్న కాగితములనుబట్టి నీ మాటయే పై నుండును. నీ శత్రువులు నశింతురు.

ఈ వాక్యముల నాలకించినతోడనే ఖానత్యాశ్చర్యము నొంది “మీరు సర్వజ్ఞులు. నేను బాపాత్ముఁడను. నా పాపములు నశించునట్లును నాకు శుభములు గల్గునట్లును నన్ను మీ రాశీర్వదింది. దేవతలఁ బ్రార్థింపవలెను” అని వేడుకొనెను. అంతట ఫకీరు సంతోషముతో నీపై నల్లాకు దయగలదు.