పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

హేమలత

సూర్యాస్తమయమైన వెనుక నిద్దఱు శిష్యులు వెంటరా నొక ఫకీరు మెల్లమెల్లగ గోపురపు మెట్లనుండి క్రిందికి దిగెను. మెట్లనన్నింటినిదిగి క్రిందికి వచ్చి తన శిష్యులతోఁ గొన్ని రహస్యములనుజెప్పి చెఱి యొకవైపునకుఁబంపి వారు బయలుదేఱిన నాలుగు గడియల కతఁడు తత్ప్రదేశమునుబాసి పురమువంక బోవుచుండెను. అతఁడు షష్టి వయఃపూర్ణుడగు వృద్ధుఁడని నెఱసిన గెడ్డము తెలియజేయుచుండెనుకాని శరీర దార్ఢ్యము జూచువారంత వయస్సుండునని నమ్మరు. తన శరీరమున బ్రాఁతయంగరకా ధరించి తలగడ్డను బెట్టికొని పూసల తావళమును ద్రిప్పుచు నతడు పురముఁ బ్రవేశించి వీధుల వెంబడి దిరుగుచుండెను.

రహిమాను ఖాను చక్రవర్తియొద్ద సెలవుగైకొని రాజమందిరమును బాసి వీధిలోనికి వచ్చువఱకు ఫకీరును దనచేతి కారుచప్పుడు చేయుచు వినోదమును గల్గించు పాటఁబాడుచు నా స్థలమునకు వచ్చెను. చక్రవర్తి తన విషయమున నేమిచేయునో తన కాగితమును దనవృత్తాంతములను నమ్మునో, నమ్మక ప్రాణములఁ దీయించునో యని భయపడుచు మందగమనముతో వచ్చుచున్న ఖాను ఫకీరును జూచి వారు భూతభవిష్యద్వర్తమానమున నెఱిఁగిన వారగుట దానును వినియుంటఁ దన భవిష్యదవస్థ నీ ఫకీరునడిగి తెలుసుకొన వలయునని తలంచి యాతని సమీపమునకు బోయి వినయముతో “అస్సలామా లేఖు” మ్మని సలాముచేసెను. ఫకీరును “ఆలేఖుం సలా” మని యచట నిలిచెను. అంతట వారిట్లు మాటాడిరి.

ఖాను – మీరు కులందర ఫకీరులా? ముదార్య ఫకీరులా?