పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ఆఱవ ప్రకరణము

ప్రపంచమునం దిప్పటికి నిలిచియున్న పురాతన కట్టడములలో నెల్ల మిగుల నున్నతమయి సర్వజనస్తవనీయమయి యున్నది, ఢిల్లీ నగరమునకు నైదు క్రోసుల దూరముననున్న కుతుబుమైనరను గోపురమని చెప్పవచ్చును. ఇది కుతుబుద్దీను, మహమ్మదీయ ఋషి పేరఁ గట్టబడినది. ఇది కట్టుట కారంభించిన యిరువదియైదు సంవత్సరములకు ముగింపబడినది. ఇప్పటి కది నిర్మింపబడి యాఱువందల యేఁబది సంవత్సరములు గడచినను నేఁటికిని జూపఱకుఁ గనులపండువు జేయుచు నాశన దేవతపాలఁబడక మహమ్మదీయుల శిల్పిశాస్త్ర నైపుణ్యమును బ్రకటించుచున్నది. అది యిన్నూటనలువది రెండడుగులు యెత్తుగలిగి గర్భమందు వంకరగ బాము మెలికలువలెఁ దిరిగి యున్న మున్నూట తొంబది తొమ్మిది మెట్లతో వెలయుచుండును.

పూర్వకాలమున ఢిల్లీ రాజ్యమును బరిపాలించిన మహమ్మదీయ చక్రవర్తుల గోరీలు దీనిచుట్టునన్నవి. నేఁడు దీని సమీపమున నొక చిన్న గ్రామము బయలు దేరినది. మనము వర్ణించుచున్న కాలమునాటికిఁ గూడ తత్సమీపమున గొన్ని సమాధులుండుటచే జనులు రాత్రులందుఁ దఱచుగ నా ప్రక్కకు బోవుచుండుటలేదు. ఈ గోపురము పయికిఁబోవువారు శ్రమ కలుగకుండ విశ్రాంతి గైకొనుటకు నడుమ నడుము నంతస్తులు మందిరములు గట్టఁబడియున్నవి. వీనినెల్ల గడచి చివరయంతస్తు పైకెక్కి చూచువారి నేత్రములకు గ్రిందనుండు మనష్యులు పిల్లలవలెఁ గన్పడుదురు. దీనియందు సాధారణముగా బరదేశగతులగు ఫకీరులు వసించుచుందురు. ఆనాఁడు