పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

హేమలత

దుండు సైన్యంబులఁగూడ బిలిపించి సన్నాహమొనర్చుచు సైనికుల కెల్ల గావలసిన భోజన సామగ్రులను గజములను బశువులను సిద్ధపఱచుచుఁ జక్రవర్తి ప్రయత్నము సేయుచుండెను. ఒకనాఁటి సాయంకాలము సంధ్యారాగము దర్శనీయమై ఢిల్లీ నగరముపైనఁగట్టఁబడిన యెఱ్ఱని వితానమువలె వెలయుచుండెను. సంధ్యారాగము క్రమముగ సదృశ్యమయి వెన్నెల వ్యాప్త మయ్యెను, నల్లని యమునానదీ జలమునందు ఢిల్లీ నగరము మేడలతోడను, మిద్దెలతోడను, పహాగోపురములతోడను, నీటఁ గట్టఁబడిన పట్టణమువలెఁ బ్రతిబింబితమై కనుపట్టుచుండెను. సాయంకాలము నమాజునకు భక్తులఁ బిల్చువారికేకలతో మజీదులు ప్రతిధ్వనులిచ్చుచుండెను. మసీదులు యగ్ర భాగములను, హిందూదేవాలయశిఖరములును మహోన్నత గోపురములును వెన్నెలలో ధగధగలాడుచు నగరముయొక్క యున్నతస్థితిని దము పొడవుచే దెలియఁ జేయుచుండెను. నగరమధ్యమునున్న కోటలో సరోవరమధ్యమున విలసిల్లు తెల్ల దామరవలె జక్రవర్తి వసియించు నేడంతస్థులమేడ క్రొత్తకాంతులతో నా వెన్నెలయందుఁ గన్పట్టుచుండెను.

ఆనాఁటిరాత్రి నాలుగుగడియ ఆయనతరువాత చక్రవర్తి రహస్య ములు మాటాలాడుకొను గదిలో మెత్తని పరుపులు వేయఁబడిన యొక కుర్చీ మీఁదఁ గూర్చుండి హుక్కా త్రాగుచునుండ నతివినయముతో నంతఃపుర సేవకుఁడగు నొక నల్లని దీర్ఘకాయముగల తురక గది బ్రవేశించి చక్రవర్తి పాదముల దగ్గర సాష్టాంగపడి భయవినయములతో మహా ప్రభూ! ఏలినవారి గులాపువాని దొక మనవి యున్నదని మెల్లగఁ బలికెను. ఆ మాటవిని యదివఱ కేదో యోజించుచున్న చక్రవర్తి మహాకోపముతో బానిస నొక