పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

29

నిరాధారయైనందున జెట్టంతకొడుకును జంపుకొనియు మొండినై యిట్లు జీవించినాడను. ఆ మరునా డల్లాయుద్దీను తన పినతండ్రిని జంపించి మరికొన్ని దినములకు మహావైభవముతో దాను జక్రవర్తి యయ్యెను. ఈతడు నీతియుబాపభీతియు లేనివాడు. ఒకటి తలచి యొకటి పలుకును. కుమారా! నాదశ యిట్లున్నది. డెబ్బదియేండ్ల వాడను. నాకు మరణము సమీపించుచున్నది. ఈబాల సంప్రాప్త యౌవన. నేను మృతినొందిన దీని నెవరైన బలాత్కారముగ నవమానింతురు. నాకు గలబెంగ యిదియే; నాకిపుడెట్టులయిన జిత్తూరు నగరము రావలెననియున్నది. భీమసింగు మహారాజుతో నా దీనదశ దెలిపి నాపయి ననుగ్రహము గలిగించిన నీకు మిగుల పుణ్యముండును. నా పేరు నారాయణసింగు, ఆహాహా! నారాయణ సింగుదశ యెంతవఱకు వచ్చినది. ఇరుపార్శ్వముల నెచ్చట దిక్కులేక యనాధుడనై యున్నాను గదా నాయనా! అనుచు సహజధైర్యమును విడుచుచుగొలకులనుండి వేడికన్నీరొలికి తన తెల్లగడ్డము దడియనేడ్వసాగెను. వజ్ర సమాన హృదయమునకు గనికరమున సృజియించు నారాయణసింగు దీనచరిత్రమును విని మదనసింగు క్షత్రియకాఠిన్యమును విడిచి యొక్క నిమిషము విచారించి , పిమ్మట “తాతా! నీవు విచారింపకుము. కష్టములు దైవికములు. మీ విషయము భీమసింగు మహారాజుతో నేను జక్కగాజెప్పి మీపయి వారికనుగ్రహము గలుగునట్లు చేసెదను. మీకష్టములు గట్టెక్కినవని నమ్ముడు. మీ మనుమరాలికిదగిన యుత్తమవంశజాతుని వెదకి పెండ్లి చేయించెదను. నామాటనమ్మి యుండుడు. కొద్ది దినములలో మీకు నేను వర్తమానమంపెదను. అప్పుడు మీరు రండు. రేపుదయమున నేను