పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

27

అని యివ్విధమున హితోపదేశమును చేయుచున్న రాజకుల భూషణునిపయి మహమ్మదీయుఁడు త్రాచుపామువలెలేచి తనచేతనున్న ఖడ్గముతో నాతని నొకదెబ్బ వేయఁజూచెను గాని నాజరుజంగాతనిఁబట్టుకొని యాదౌర్జన్యము నివారించెను. వెంటనే సింగమువలె సింగునులేచి యాయుధ పాణియై నిలువ ఖాను వెనుకదీసెను. అనంత రమామందిరము విడిచి మదనసింగు నాజరుజంగుతోఁగలిసి మఠమునకరుదెంచెను. తనదురాచారమును జక్రవర్తికి నివేదించి తన కపాయమును గలుగజేయుదురని నాజరుజంగు మదనసింగులపయిఖాను సాహేబున కీవఱకే యాగ్రహమును ననుమానమును నుదయించెను. గోరుచుట్టుపై రోఁకటిపోటననట్లు నేఁటికథ దానినత్యున్నత స్థితికిఁ దెచ్చినది. రాజనందనుని సంబంధమున సజాతీయుఁడైన నాజరుజంగు పై నతనికి మహాగ్రహము గలుగ, నే యుపాయములను బన్నియైనను నే నేరములను జక్రవర్తితోఁ జెప్పిఅయినను తాను నిర్దోషి యనిపించుకొని వారపరాధులని దండింప జేయవలెనని మహమ్మదీయుఁడు యోజింపుచుండెను. శత్రురాజ్యమున నుండుట ప్రాణాపాయకరమని మదనసింగు ప్రయాణమగుచుండెనుగాని యతని ప్రయాణము హేమలతకు దుఃఖకారణముగ నుండెను. పైవాదము దటస్థమయిన మఱునాడు తెల్లవాఱునపుడు, ప్రయాణము నిశ్చయింపఁబడెను. ఆ రాత్రి హేమలత యన్నము ముట్టుకొనలేదు. ఎట్లయినను రాకొమరుఁడు పోకతీరదని తలఁచి వృద్ధయోగి రహస్యముగ వొకగదిలోని కాతనిం దీసికొనిపోయి రహస్యమును బయలుపఱుపకుండ ననేక ప్రమాణములఁజేయించి యొట్టుఁబెట్టించి తన పూర్వాశ్రమవిచిత్రవృత్తాంతములీ తెఱుంగునఁజెప్పనారంభించెను “నాయనా! నీవు నా కుమారునివంటివాడవు. నిన్ను జూడ నాబంధువులందఱు