పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

25

నది గనుక నతనికి నీరసము దక్క దక్కిన రోగిమేదియుఁ గానరాదయ్యెను. ముసలివాని నేర్పుచే నరములకు బలము కలుగుచుండెను. తన ప్రియమితుఁ డారోగ్యస్నానమొనర్చువఱకు నాజరుజంగా గ్రామముఁబాసి పోఁదలంచుతో నందున దానచట నుండు నంతకాలము ఖానుగారియింట బసచేసి ప్రతిదినమును ఖాను యొక్క దుర్గుణములను, మర్కటచేష్టలను స్వానుభవమువలన గ్రహించు చుండెను. అందుచే సద్గుణసంపన్నుఁ డైనందున, నన్యమతస్థుఁ డయినను సింగునం దనురాగంబును స్వమతస్థుఁడు నాప్తబంధుఁడైనను దుర్గుణుఁడయిన ఖాను నెడ నసూయయు నాజరుజంగునకుఁ గలుగ నారంభించెను. హేమలత చేయు వివిధోపచారములును నామె రూపాతిశయమును సుగుణ వైభవమును మదనసింగు హృదయమున నామె యెడ గాఢానురాగమును గల్గించెను. మధ్యాహ్న కాలమున సింగునకు నిద్రరాకుండగాఁ జిన్న నాఁట దాతాతదగ్గఱ నేర్చుకొనిన హిందీభాషలోని భక్తిరస ప్రధానములగు నీతికీర్తనల హేమలత శ్రావ్యతర కంఠముతో సప్పుడప్పుడు పాడుచుండెను, ఒకప్పుడు తాఁ బెంచుచున్న చిలుకకు “రామ రామ” యని మాటలు నేర్చుచు వినువారి చెవులకు విందు సేయుచుండును. ఈ కన్య తన యీఁడుకును స్థితికిని దగిన విద్యలను దనపితామహునిదగ్గఱ చేర్చియుండుటచే నన్యులెవరు లేని సమయములయందుఁ దాతకు వినుపించువంకఁబెట్టి తేనెతేటలొలుకు మాటలతోఁ బుస్తకము జదివి సింగునకు హృదయానందమును గలిగించెను అదిగాక ప్రొద్దుపోవునపుడు వృద్ధుఁడును వినోదకరములగు కథలను, మ్లేచ్ఛరాజవృత్తాంతములను దన చిన్ననాఁటి యుద్ధములను గడుఁజమత్కారముతో వర్ణించి చెప్పుచుండును. ఆ గ్రామవాసు లందరును రహిమానుఖాను చేష్టలను హాస్యరస ప్రసంగములుగ మార్చి వానికిఁ జెప్పి నవ్వించు