పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

హేమలత

చక్రవర్తి దయ సంపాదించు కొనుట కాధారమును కలిగినది. అందుచే నానందపారవశ్యమున వెనుక చింత మఱచి గులామును భోజనమునకుఁ బొమ్మని పంపి నందుని దూరముగ దీసికొనిపోయి యిట్లు చెప్పఁ దొడంగెను. నందా! నీవు మిగుల విశ్వాసము గలవాడవు. నీతో నాకు రహస్యకార్య మొకటి కలదు. ఆకార్యము జేసినయెడల నీ చేతినిండ వరహాలు పోసెదను. ఈ గ్రామమున నంధుఁ డగుయోగివద్దనున్న యాసుందరాంగిని నాకడకు మాయాపాయముననో సమ్మతితో తీసికొని రావలయును. దానిని వివాహ మాడకున్న నేను జీవింప జాలను. నీ నిమిత్తమయి నే నెదురుచూచుచుంటిని. అని చెప్పిన తోడనేనందుఁ డులికిపడి శరీకము జల్లుమన “స్వామి! ఆమె సద్గుణ వంతురాలు, ముసలివాఁడును మిగులమంచివాడు. జనుల కందఱకు నతని యందు భక్తికలదు. అది నాకు సాధ్యమగునా” యని నందుడు తన యసమర్థత నెఱిఁగింపఁ గోపోద్దీపితుఁడై ప్రక్కనున్న ఖడ్గమును జేఁ బూని విశ్వాసఘాతకుఁడా! నాసొమ్ముదిని నాకార్యమును జేయలేవా? ఇది చేయవేని నీ ప్రాణము దక్కవుసుమీ” యనిబెదిరింప మందుఁడగు నందుఁడు మ్లేచ్ఛుని పాదములపైఁబడి దేవా! ఆగ్రహింపకుఁడు. నా ప్రాణములనైన ధారవోసి యీ కార్యము సాధించెదను. గోవింద శాస్త్రియింట దాసియగు రాధవలన నీ కార్యమగును. నెలలో సమకూర్తును.” అని వాగ్దానము చేసిన తరువాతఁ దురుష్కుఁడు నందుని విడువ నతడు మృత్యుని ముఖమునుండి వెడలినట్లు సంతోషించుచు స్వామికార్యసాధనం దుపాయమలఁ బన్న దొడంగెను. ఇదియిట్లుండ మదనసింగునకు గాయము నెమ్మదిగా నున్నదని హేమలత యిష్టదేవతల కెల్ల ముడుపులు గట్టుచు సంతోషించుచుండ నాజరుజంగు నమితానందభరితుడయి నమస్కరించెను. మదనసింగునకు నానాఁటి కారాగ్యము గలుగ నారంభించెను. రక్తక్షయమయి,