పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

హేమలత

లతకు నిద్రరాకుండుటచే “దాదా! ఈయన యవస్థను గొంతవఱకు గనిపెట్టి యుండెదను. పెద్దవాడవు నీవు నిద్రపొమ్ము నే నిదివరకు నిద్ర పోయినా” నని ప్రత్యుత్తరమిచ్చి తానామంచము వద్దఁ గూర్చుండి మదనసింగు లక్షణములఁ జూచుచుండెను. యోగియు మదనసింగు యొక్క యనుచరుని వలన నతఁడుత్తమ రసపుత్రవంశస్థుడని యెఱింగి గాయము తగిలిన కారణ మడిగి తెలిసికొని పిమ్మట నిద్రపోయెను. రసపుత్రుఁడుసు సుఖముగఁ గొంతవఱకు నిద్రించెను. హేమలత యతని మంచము దగ్గఱ గూర్చుండి ఱెప్పవాల్చక చూచుచుండెను. హేమలత యసమానరూప లావణ్యములయం దాశకాలపుస్త్రీలలో నెల్ల శిరోరత్నమై యుండెనని చెప్పుటకు సందియములేదు. నిరంతరము నామెను బాయకుండు సద్గుణములు తక్క తదితర భూషణము లామెకడలేవు. ఆకర్ణాంత విశాలనేత్రములను, దొండపండువలె సహజారుణ్యముల మోవియు వంకరతిరిగి విండ్లవలెనున్న కన్బొమలును, నిరంతర మందహాసమును, నామె ముఖారవిందలావణ్యమును బరిపూర్ణత నొందించెను. ఆమె పితామహుఁ డాగ్రామము వచ్చినప్పుడు బాలికగ నుండుటచే శుక్లపక్ష చంద్రమండలమువలె దినదిన ప్రవర్థమానమగు నామె రూపమునుచూచి తత్పురవాసు లామెయెడ ననురాగసమేతులయిరి. ఆమె రాజవీధిని బోవు తరి తేరిపాఱి యామెను గన్గొనని బాటసారులును, ఉత్కంఠమునఁ బుష్పహారము వేయని పూలవర్తకులను, నామెకొఱకుఁ జక్కెర పెట్టని కోమటులను లేరు. కాని యా జగన్మోహనాకారము ప్రజల కనేకులకు విచార కారణమయి యుండెను. ఇంతసౌందర్య విలాసవతియగు కన్య యేమహారాజు గర్భమునైన నుదయింపక నిరుపేదయయిన జాత్యంధుని మనుమరాలయి పుట్టి సామాన్య స్త్రీ వలె పాటుపడవలసివచ్చెను గదా యని జనులందఱు