పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

హేమలత

దన కుమారున కిల్లాలైన చాలునని కోరుచుండెను. అప్పుడు మదనసింగు జనార్ధనసింగును జూచి “అయ్యా! హేమలతకు సహోదరుడైన కుమారసింగెచట నున్నాడు? అత డాదినమున మీమఠమునకు వచ్చెగద” అని యడుగ “నాయనా! ఆ కుమారసింగే యీ హేమలతయయ్యెను. యుద్ధమునందు జరిగిన కలకలములో హేమలత దుష్టుల పాలబడకుండ బురుషవేషము వైచికొని యా పేరు పెట్టుకొన్నది.” అని జనార్ధనసింగుత్తరము చెప్పెను. హేమలత యొక్క సమయోజిత బుద్ధికిని యుక్తికిని మదనసిం గాశ్చర్యపడుచుండ నపుడు భీమసింగు లక్ష్మణసింగునెదుట జనార్ధనసింగు హేమలతను మదనసింగునకిచ్చి వివాహము చేసెదనని చెప్పి, తన తండ్రికిని నావివాహ మిష్ట మగుటచే దద్విషయ ప్రయత్నముల నొనర్పు డని భీమసింగుతోడను దక్కిన రసపుత్రులతోడను చెప్పెను. ప్రతాపసింగు మృతినొందుటచే బెద్దలెవ్వరు లేరని మదనసింగుపక్షమున భీమసింగు సర్వ ప్రయత్నములను జేయించి పందిళ్ళు వేయించెను. నారాయణసింగు జనార్ధనసింగును హేమలత వివాహ మగువఱకును దమమందిరమునకు రండిని భీమసింగు పిలిచికొని పోయెను. సంపూర్ణ శరత్కాల చంద్రమండలము నపహసించు హేమలత ముఖము నవలోకించి ముద్దు పెట్టుకొని మెఱుపు దీగబోలు నామె దేహమును బిగ్గ గౌగలించికొను నిమిష మెన్నడు వచ్చునాయని మదనసింగు నిమిషమొక గడియవలె గడువుచుండెను. రూపొందిన మన్మధునివలె నల్లపట్టు కుచ్చుల బోలు మీసముతోడను సంపూర్ణచంద్రబింబమువంటి ముఖముతోడను దనహృదయమును బాయకున్న మదనసింగునుదలచి కొని హేమలతయు