పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

151

బడకుండ దైవానుగ్రహమున బ్రతికి శిబిరమును విడిచి యింత కాలమును మారువేషముతో బహుదేశముల దిరిగి సమస్తయాత్రలు సేవించి తుదకు బాలిగ్రామమునకు వచ్చి మీరు బ్రతికియుండుట నెరిగి మనశ్శాంతి గలిగి యుండి నేడుగలిసికొన్నాను” అని జనార్ధనసింగు తన పూర్వాశ్రమవృత్తాంతమును నెరిగింప నారాయణసింగు వానికంఠమును బట్టి తనకుమారుడని తెలిసికొని యక్కున జేర్చి యనిర్వాచ్యానందము నొంది. నాయనా! చక్రవర్తి నాకన్నులను బొడిచివేయకముందు నిన్ను గన్నులార జూచినాడను. నేడు నిన్ను జూచి సంతోషింపక నాకు గన్నులు లేవు. అయినను నీవును హేమ లతయు నాకు రెండుకన్నులయి యున్నారు. మీరు దొరకుటె నాకు గనులు లభించుట” యని పలికి సంతోషమున వెఱ్ఱివానివలె నుండెను. జనార్ధనసింగు హేమలతను శివప్రసాదుగృహమునకు గొనిపోవునాడు గాని యీరెండు దినములలో దనయొద్దనున్నపుడుగాని, తానామెకు దండ్రి యగుటజెప్ప నందున దనకు జ్వరము తగిలినప్పుడు రక్షరేఖ గట్టిన గోసాయియే తన తండ్రియని హేమలత ప్రథమపర్యాయమున విని విస్మయమొందెను. తానామెను విడిచిపోవు నాటి కెనిమిది సంవత్సరముల బాలికగ నుండి నేడు సంప్రాప్తయౌవనయై యుండుటచే జనార్ధ సింగు చాలకాలమున కగపడిన కూతును ముద్దు పెట్టుకొని యొడిలో గూర్చుండబెట్టుకొనెను. తరువాత సువర్ణ బాయి హేమలతను జూడగోరినందున జనార్ధనసింగామెను లోని కంపెను. సువర్ణయు హేమలత సౌందర్యాదులను, మొగమున రసపుత్ర కళను, సత్కులజాత చిహ్నములను వినయసంపత్తినిజూచి యామె యెట్లయిన