పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

హేమలత

బడనందులకు దుఃఖించుచున్న నారాయణసింగు నొద్దకు జని, మదనసింగు “తాతా! మీ హేమలత వచ్చినది సుమీ!” యని పలికెను. తోడనే నారాయణ సింగదరిపడి “నాయనా! ఏదీ? మాహేమలతా! ఏదీ? నాయనా! నిజమేనా చెప్పచెప్పు” మని వేగిరపడుచుండ నంతలో హేమలత మేఘములచాటున మెఱపువలెవచ్చి “దాదా! దాదా!” అని పలుకుచు నానందాతిశయమున నన్యపురుషులుండి రనుమాట మఱచి యానందభాష్పములతో ముసలివాని యొడిలో గూర్చుండి యతనికంఠమును గట్టిగ గౌగలించుకొని విలపింప సాగెను. నారాయణసింగును మనుమరాలిపై జేయివైచి కనులనుండి భాష్పము లామెశిరము పైబడ “అమ్మా! నాటికి నేడు నిన్ను జూచితిని. నిన్ను జూచి యానందించుటకు నీతండ్రి లేడు గదా తల్లీ” యని పరిపరిభంగుల దనసంతాపసంతోషములను మాటలచేతను జేష్టలచేతను దెలుపుచుండెను. అప్పుడు మదనసింగు వృద్ధునితో “తాతా! నీకుమారుడు వచ్చినాడు చూచెదవా?” యని పలుక నారాయణసింగు తనపుత్రుడావఱకె యలాయుద్దీను చక్రవర్తిచే జంపపడినట్లు దృఢమగునమ్మకముగలవా డగుటచే నామాట నమ్మక “నాయనా! మీరు నన్నేల పరిహసించెదరు! నాకొడుకెక్కడ! నాకగపడుటెక్కడ? జలాలుద్దీను చచ్చుటకుముం దారాత్రి నాకును నా కుమారునకు ఋణము తీరినది. అటువంటి పుత్రరత్నము నావంటిపాపకర్ముల కేలదక్కును? నాయనా! జనార్ధనసింగూ! ఇక నాకగపడవుగద!” అని విలపించుచున్న నారాయణసింగుమాటల కడ్డమువచ్చి “దాదా! నామాటల నానవాలు పట్టజాలవా! నేను జనార్ధనసింగును, ఆరాత్రి నేనల్లాయుద్దీను చేత