పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

147

నారంభించిరి. అప్పుడానూతన పురుషుడు లేచి సభా సదులను తన వృత్తాంతమును విన నవధరింపుడని వేడికొని యిట్లు పలికెను. “రాజపుత్రులారా! నా చరిత్రముతిదీనమయినది. నేనొకపరువుగల రాజపుత్ర వంశమునం దుదయించితిని. నా బాల్యముననే నా తల్లి మృతినొందుటచే నేను బ్రయాగలో నా మేనమామలవద్ద బెరిగితిని. మా కాపురము రాజస్థానమున నున్న జయపురమైనను నేను ఢిల్లీ చక్రవర్తుల పాలనము క్రింద నున్న దేశములో నుండుటచే జలాలుద్దీను చక్రవర్తియొద్ద సేనాధిపత్యమును గ్రహించి, యిరువదియేండ్లు దాటకముందే సేనాచక్రవర్తి యను గ్రహమునకు బాత్రుడనై గొప్పవాడనైతిని. జయపురమునందు నా తండ్రి నాతల్లి పోయిన తరువాత మరల వివాహమాడి ద్వితీయ భార్యయు బిడ్డలును మృతినొందుటచే వైరాగ్యముగలవాడై ప్రయాగకువచ్చి మా మేనమామల ప్రోత్సాహముచే జక్రవర్తి యొద్ద సైన్యాధిపత్యమును సంపాదించెను. అలాయుద్దీను దక్షిణదేశమునుండి వచ్చి జలాలుద్దీనును జంపించి తానె చక్రవర్తి కాదలంచి యాకార్యమున దోడ్పడుమని నన్నును నాతండ్రిని నడుగ మేము నిరాకరించితిమి. అందుచే మాపై నాగ్రహముగల్గి మాతండ్రికన్నులను దనచేతికత్తితో పొడిచివైచి నన్ను వధించుటకు యత్నింపగా నే నామహాపద దప్పించికొని పాఱిపోతిని. నాభర్యయునంతకు ముందే రెండు సంవత్సరముల క్రిందట పరలోక గతురాలై నందున నప్పటికి నేడెనిమిదేండ్ల వయసుగల నా చిన్న కుమారికను శిబిరమున విడిచి నేదేశాంతరములకు మారువేషముతో నరుగ బూనితి. తురకలవలన నాకింత