పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదవ ప్రకరణము

ఆమఱునాడు మధ్యాహ్నము దర్బారు జరగు నని భీమసింగు ప్రకటించెను. రాజపుత్రులెల్ల నియమిత కాలమునకు సభామంటాపమున కరిగి యుచితాసనముల గూర్చుండిరి. భీమసింగును మహారాణాయును వచ్చి కొలువు దీర్చి యుద్ధమునందు వీరస్వర్గమునకు జన్న శూర శిఖామణులను గూర్చి విచారము దెలిపి శరీరముల కాశింపక యుద్ధ మొనర్చిన విక్రమ శాలుర కనేక బహమానములను బిరుదులనునిచ్చి వారిని మిగుల గౌరవించిరి. అందు ముఖ్యముగ మదనసింగు సాహసధైర్యములకు రాణా మెచ్చికొని శౌర్యవిధియగు ప్రతాపసింగు సేనానాయకత్వమునకు నాతని నియోగించిరి. రాజపుత్ర సేనానాయకత్వము నందుటకు మదనసింగు మహానందము నొందినను నాడు చిత్తూరు సభామంటమున బినతండ్రి లేకుండుటయు, సభయెల్ల జిన్న వోవుటయు నాతని యుద్యోగమును దాను స్వీకరించుటయు నాతనికి గొంత దుఃఖముగల్గించెను. ఆయుత్సవము దాదాపుగ ముగియునప్పటికి నలుబదియేండ్ల వయస్సుగల యొక చామనచాయమనుష్యు డుత్తమరసపుత్రులు ధరించుకొను వస్త్రాలంకారములతో సభ కరుదెంచి రాణా యెదుట నిలిచెను. అతడారీతిగ మున్నెన్న డాకొలువునకు రానందున నాతని నెవ్వరు నానవాలు పట్టి తగు గౌరవమునొనర్పక విస్మయమొందుచుండ భీమసింగాతని నుచితాసనమున గూర్చుండ బనిచెను. మదనసింగు మొదలగు వారీతని మొగము మున్ను జూచినట్లున్నదని తమలో దాము గుసగుసలాడ